కేజీబీవీ ఎస్ఓలకు ఆ బాధ్యతలు వద్దు

కేజీబీవీ ఎస్ఓలకు ఆ బాధ్యతలు వద్దు

హైదరాబాద్: మోడల్ స్కూళ్ళకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల నిర్వహణా బాధ్యతలను సమీపంలోని కేజీబీవీప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఆ సంఘం బాధ్యులు కే జంగయ్య, చావ రవి ఓ ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూళ్ళకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల నిర్వహణ తమ బాధ్యత కాదని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందిన నేపథ్యంలో... సమీపంలోని  కేజీబీవీ ఎస్ఓ లకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎస్పీడి ఉత్తర్వుల్లో పేర్కొనడం సరైంది కాదన్నారు. 

ఇప్పటికే ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభం...

ఇప్పటికే పలు కేజీబీవీల్లో ఇంటర్నీడియట్ క్లాసులు ప్రారంభమయ్యాయన్న వారు... విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కేజీబీవీల్లో వసతుల కొరతతో పాటు పాఠశాల, కళాశాలల పర్యవేక్షణ, వసతి గృహ నిర్వహణ ఎస్ఓలకు భారంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యతలను కూడా చూడాలంటే... తమ పాఠశాల, కళాశాలలను గాలికొదిలేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా విద్యార్థుల చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే...

అధికారుల ఇలాంటి అనాలోచిత నిర్ణయాలే విద్యాశాఖలో తీవ్రమైన వివాదాలకు కారణమవుతున్నాయన్న వారు... కేజీబీవీల్లోని చాలా మంది సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో నియామకం అయ్యారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు కదా అని ఏ బాధ్యత ఇచ్చినా చేస్తారనే ఆలోచనతో అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు అర్థమవుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే  ఏ చిన్న పొరపాటు జరిగినా... కనికరం లేకుండా ఎస్ఓలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని, ఎస్ఓల జాబ్ చార్ట్ లో గానీ కాంట్రాక్టు అగ్రిమెంట్ లో గానీ లేని అదనపు బాధ్యతలను వారికెలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.