విదేశాల్లో ఉన్నవారు ఓటు వేయడంలేదు..!

విదేశాల్లో ఉన్నవారు ఓటు వేయడంలేదు..!

విదేశాల్లోని లక్ష మంది ఓటర్లలో 25 వేల మందే వచ్చి ఓటేశారు

న్యూఢిల్లీవిదేశాల్లోని మనోళ్లలో కేవలం కొంతమంది మాత్రమే ఇక్కడికొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎన్నికల కమిషన్​ పేర్కొంది. ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ విదేశాల్లో ఉంటున్న ఇండియన్ల సంఖ్య(పౌరసత్వం వదులుకోనివారు) 99,807.. ఇందులో 91,850 మంది పురుషులు కాగా, 7,943 మంది మహిళలు, మిగతా 14 మంది ట్రాన్స్​జెండర్లు.. వీరికి భారత పౌరసత్వంతో పాటు ఓటుహక్కు కూడా ఉంది. మొన్న దేశవ్యాప్తంగా జరిగిన లోక్​ సభ ఎన్నికల్లో కేవలం 25 వేల మంది మాత్రమే వచ్చి ఓటేసి వెళ్లారు. మిగతా వారు ఓటుహక్కు ఉన్నా వినియోగించుకోలేదు. విదేశాల్లో ఉంటున్న కేరళ ఓటర్ల సంఖ్య ఎక్కువే..  పోలింగ్​ టైంలో ఇండియాకు వచ్చి ఓటేసే వారి సంఖ్య కూడా దానికి అనుగుణంగానే ఉంటుందని ఈసీ వెల్లడించింది.

కేరళ ఓటర్​ లిస్టులో 85,161 మంది విదేశాల్లో ఉంటున్నారు.. వారిలో 25,091 మంది మొన్నటి లోక్​సభ ఎన్నికలపుడు వచ్చి ఓటేసివెళ్లారని తెలిపింది. దేశంలో ఓటుహక్కు ఉన్నా వినియోగించుకోకపోవడానికి ప్రధాన కారణం వచ్చి వెళ్లడానికి అయ్యే ప్రయాణ ఖర్చులేనని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్సీ ఓటింగ్​ సదుపాయం కల్పిస్తే విదేశాల్లో ఉంటున్న ఇండియన్లు అందరూ ఓటేయొచ్చని చెబుతున్నారు. దీనికోసం ప్రవేశపెట్టిన బిల్లు 16వ లోక్​సభ తో పాటే రద్దయింది. తాజాగా ఈ బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టాలని న్యాయ మంత్రిత్వ శాఖ భావిస్తోంది.