మిర్చి రైతులకు వెయ్యి కోట్ల నష్టం

మిర్చి రైతులకు వెయ్యి కోట్ల నష్టం

వ్యాపారుల జిమ్మిక్కులతో మునుగుతున్న అన్నదాత

    నెల రోజుల్లో క్వింటాల్‌‌‌‌కు రూ.8 వేలు తగ్గిన ధర

    22.80 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా

    ఇప్పటి వరకు కొన్నది     2.27 లక్షల క్వింటాళ్లే

    ఇంకా మార్కెట్‌‌‌‌కు రావాల్సింది 20 లక్షల క్వింటాళ్లు

 

జనవరి ప్రారంభంలో నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ రకం మిర్చి గరిష్ఠంగా రూ.20 వేల నుంచి రూ.21,500 వరకు రికార్డు స్థాయి ధర పలికింది. నెల చివరికి వచ్చేసరికి  రూ.8 వేలకు పైగా పడిపోయింది. శుక్రవారం మిర్చి గరిష్ఠ ధర  వరంగల్‌‌‌‌లో రూ.13,500, ఖమ్మంలో రూ.13,100కు చేరింది. కనిష్ఠంగా రూ.10వేల లోపే పలుకుతోంది. గడిచిన  మూడు, నాలుగురోజుల్లోనే ధరలు దారుణంగా పతనమయ్యాయి. వ్యాపారుల మాయాజాలంతో రాష్ట్రంలో మిర్చిరైతులు వెయ్యికోట్ల రూపాయలు నష్టపోతున్నారు. సీజన్‌‌‌‌ మొదట్లో మిర్చి నంబర్‌‌‌‌ టూ రకం రూ.13వేల నుంచి  16వేల వరకు పలికింది. తాజాగా నంబర్‌‌‌‌ టూ రకం ఇందులో సగానికి చేరింది.  నెల  క్రితం ఎందుకూ పనికి రావనుకునే తాలు మిర్చి ధర కూడా రూ.10 వేలు పలికితే, నేడు కనిష్ఠ ధర కూడా అంత లేదని రైతులు వాపోతున్నారు. మిర్చి రైతులు ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే మొదటి విడత పంట ఏరారు.    తోటలు  ఏరడం ఇప్పుడిప్పుడే స్పీడ్​అందుకుంది. పంట చేతికొస్తుందనగా వ్యాపారులు ధరలు తగ్గించడంపై మిర్చి రైతులు మండిపడుతున్నారు. మార్కెటింగ్‌‌‌‌శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో మిర్చి దిగుబడి  22లక్షల 80వేల క్వింటాళ్లు. రాష్ట్రంలోని అతిపెద్ద మిర్చి మార్కెట్లు ఖమ్మం, వరంగల్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లోని మహబూబ్‌‌‌‌ మాన్షన్‌‌‌‌ మార్కెట్లలో నెల రోజుల నుంచి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ 30 రోజుల్లో కేవలం 2లక్షల 27వేల క్వింటాల్‌‌‌‌ మిర్చి మాత్రమే మార్కెట్‌‌‌‌కు రాగా వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే ఇంకా మరో 20లక్షల క్వింటాల్‌‌‌‌ మార్కెట్‌‌‌‌కు రావాల్సి ఉంది. ప్రస్తుత ధర ప్రకారం 20లక్షల క్వింటాళ్ల మిర్చికి రైతులు క్వింటాకు రూ.5వేల నుంచి రూ.8వేల వరకు
నష్టపోనున్నారు.

ఒక్కసారిగా తగ్గించిన్రు

వ్యాపారుల జిమ్మిక్కులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నవంబర్‌‌‌‌ నెలలో అంతర్జాతీయంగా డిమాండ్‌‌‌‌ ఉండడంతో మిర్చి నిల్వలు మొత్తం అమ్మేశారు. దీంతో మార్కెట్‌‌‌‌లో నిల్వలు లేక పోవడంతో జనవరి నుంచి కొత్త మిర్చి  భారీ ధరలకే కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తమిర్చికి ధర పలికింది. సీజన్‌‌‌‌ ప్రారంభంలోనే  రూ.20వేలకు పైగానే ఉండడంతో రైతులు సంతోషించారు. తీరా రైతులు మార్కెట్‌‌‌‌కు తీసుకురావడం ఎప్పుడైతే పెరిగిందో వ్యాపారులు రింగై ఒక్కసారిగా ధరలు తగ్గించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో గత ఐదారు రోజుల్లోనే రూ.5వేలకు పైగా ధర తగ్గిందని విమర్శిస్తున్నారు.

32శాతం సాగు తగ్గింది
దేశవ్యాప్తంగా మిర్చి సాగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు కీలకం. రాష్ట్రంలో ఖరీఫ్లో సాధారణ సాగు 1.81లక్షల ఎకరాలు కాగా, వర్షాల ప్రభావంతో 1.23 లక్షల ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగైంది. దాదాపు 60 వేల ఎకరాల వరకు (32శాతం) తగ్గిపోయింది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జగిత్యాల, కరీంనగర్, గద్వాల జిల్లాల పరిధిలో మిర్చి సాగు చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో మిర్చి దిగుబడి 3.98 లక్షల టన్నుల అంచనాలు ఉండగా ఈ ఏడాది సాగు తగ్గడంతో 2.27టన్నులే వస్తుందని అంచనాలు ఉన్నాయి.