రైలు ఇంజన్‌ ఢీకొని ముగ్గురు మృతి

రైలు ఇంజన్‌ ఢీకొని ముగ్గురు మృతి

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేట్రాక్‌పై పెయింటింగ్ పనులు చేస్తున్న రైల్వే సిబ్బందిని అకస్మాత్తుగా వచ్చిన రైలు ఇంజిన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా… తొమ్మిది మంది తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి దగ్గర ఈ విషాద ఘటన జరిగింది. బ్రిడ్జిపై 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నుంచి రైలు ఇంజన్ వికారాబాద్ వైపు వస్తోంది. అయితే  ట్రాక్‌పై పనులు చేస్తున్న సిబ్బందికి రైల్వే అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. రైలు ఇంజన్ దగ్గరికి వచ్చిన తర్వాత రైల్వే ఉద్యోగులు గమనించారు. వెంటనే వారంతా ట్రాక్‌పై నుంచి తప్పించుకునే ప్రయత్నంలో.. ముగ్గురిని రైలు ఇంజన్ ఢీకొట్టింది. దీంతో వారు ముగ్గురు చనిపోయారు. మిగతా తొమ్మిది మంది పట్టాలు దాటిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందకున్న రైల్వే ఉన్నతాధికారులు, వికారాబాద్ జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారుల సమాచార లోపం కారణంగానే ముగ్గురు మృతి చెందారన్నారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు.