- ఆర్టీసీ కార్మికుల డిమాండ్.. బాగ్ లింగంపల్లి నుంచి బస్ భవన్ దాకా ర్యాలీ
- బైపోల్ టైమ్‌లో హామీలిచ్చి మోసం చేశారు: హనుమంతు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులకు 2017,2021 పీఆర్సీలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) జనరల్ సెక్రటరీ హనుమంతు, ప్రెసిడెంట్ సుధాకర్ డిమాండ్ చేశారు. 7 ఏండ్ల నుంచి కార్మికులకు జీతాలు పెరగకపోవటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం టీజేఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్ భవన్ దాకా చలో బస్ భవన్ పేరిట ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( ఈడీ) కృష్ణకాంత్ కు టీజేఎంయూ నేతల బృందం వినతిపత్రం అందజేసింది. ఆ తర్వాత బస్ భవన్ దగ్గర నిర్వహించిన సభలో హనుమంతు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మునుగోడు బైపోల్ టైమ్ లో హామీలు ఇచ్చి రిజల్ట్ తరువాత కార్మికులను మోసం చేశారని ఆరోపించారు.
ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేయటంతో కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల అమ్మకాల విషయంలో ఇటీవల కార్మికులను అవమానపరిచేలా డిపోల్లో ఫ్లెక్సీలు కూడా పెట్టారని తెలిపారు. ఆర్టీసీ సంస్కరణల పేరుతో కార్పొరేషన్‌ను ఎండీ సజ్జనార్ నిర్వీర్యం చేస్తున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. రాత్రి 9 గంటల తరువాత మహిళ కండక్టర్లకు డ్యూటీలు వేయవద్దని సీఎం ఆదేశించినా, డ్యూటీలు ఇస్తునే ఉన్నారని వెల్లడించారు. కార్మికులకు సంబంధించిన పీఎఫ్, సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ నిధులు రూ.3 వేల కోట్లను ఆర్టీసీ ఉపయోగించుకొని ఇవ్వటం లేదన్నారు. దీంతో లోన్ల కోసం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులు రోజుకు 16 గంటల పని ఒత్తిడితో సతమతమవుతున్నరని పేర్కొన్నారు.

