V6 News

టీఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతు‌న్నారు

టీఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతు‌న్నారు

తెలంగాణ వస్తే ప్ర‌జ‌లు త‌మ‌ జీవితాలు బాగుపడతాయనుకున్నారు కానీ… ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చాక కల్వకుంట్ల కుటుంబం మాత్రమే భాగుపడిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. గ‌త ఆరేళ్లుగా సీఎం కేసీఆర్‌, మంత్రులకు అబద్దాలు మాట్లాడటం అలవాటైందని ఆయ‌న అన్నారు. ప్రతి విషయంలో టీఆరెస్ నేతలు బూటకపు మాటలు మాట్లాడుతున్నార‌న్నారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ప్రస్తావిస్తే మంత్రి జగదీష్‌రెడ్డి త‌న‌పై అడ్డగోలుగా మాట్లాడారని ఉత్త‌మ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 వేల లోపు రుణం ఉన్న రైతులకు కూడా మాఫీ కాలేదని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పాలని, తీపి కబురు అవసరం లేదని చెప్పారు. 2018 ఎన్నికల్లో గెలుపు కోసమే 90శాతం రైతులకు రైతుబంధు ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఖరీఫ్‌కు 30శాతం, రబీకి 50శాతం రైతులకు రైతుబంధు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వం పంట బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారని, కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 55లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారని తెలిపారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి వేస్తే కొనుగోలు హామీ ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా కొత్తగా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఉత్తమ్ అన్నారు.