మీరా..ది గ్రేట్‌‌‌‌: హిమాలయాలను ఎక్కిన తొలి శునకం

మీరా..ది గ్రేట్‌‌‌‌: హిమాలయాలను ఎక్కిన తొలి శునకం

ఎముకలు కొరికే చలి.. ఊపిరి తీసుకోడానికీ కష్టమయ్యే పరిస్థితి.. పైగా నిటారు పర్వతాలు.. ఇంతటి ప్రతికూల వాతావరణంలో ట్రైనింగ్‌‌‌‌ తీసుకున్న మనుషులే హిమాలయాలు ఎక్కేందుకు తటపటాయిస్తారు.. అలాంటిది ఓ నేపాలీ
కుక్క అలవోకగా సుమారు 7 కిలోమీటర్ల ఎత్తైన పర్వతాన్ని ఎక్కేసింది. హిమాలయాలను ఎక్కినతొలి శునకంగా రికార్డు సృష్టించింది.

మీరా పర్వతంపై..
అమెరికాకు చెందిన డాన్‌‌‌‌ వార్గోవ్‌‌‌‌స్కీ తన బృందంతో కలసి నేపాల్‌‌‌‌లోని ఖాట్మండూ బేస్‌‌‌‌ నుంచి హిమాలయన్‌‌‌‌ ట్రెక్కింగ్‌‌‌‌ మొదలెట్టాడు. పర్వతాన్ని దిగుతున్న సమయంలో ఆ బృందాని కి ఓ కుక్క కనిపించింది. దాన్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. చాలా తొందరగానే ఆ బృందంలో అది భాగమైపోయింది. మీరా పర్వతంపై కనిపించింది కాబట్టి దానికీ ‘మీరా’ అనే పేరు పెట్టారు. ఆ పర్వతాన్ని దిగాక ‘బరుంట్సే’ పర్వతారోహణ మొదలైంది. వారితోపాటే దాన్నీ ట్రెక్కింగ్‌‌‌‌కు తీసుకెళ్లారు. పర్వతారోహణ మూడు వారాల పాటు సాగింది. బృందంతో పాటు వారి కుక్క మీరా కూడా హుషారుగా బరుంట్సేను ఎక్కేసింది. 2018 నవంబర్‌‌‌‌ 9న పర్వత శిఖరాన్ని చేరుకుంది.

రెండ్రోజులు చలిలోనే..
మీరాను భరిస్తామా అని ముందు అనుకున్నామని, కానీ దాని పర్వతారోహణ నైపుణ్యం చూసి ముగ్ధులైపోయామని వార్గోవ్‌‌‌‌ చెప్పారు. ‘మీరా మాకు ప్రత్యేకమైన కుక్క, యాత్రకు లక్‌‌‌‌ తీసుకొచ్చింది. మీరా మా కంటే వేగంగా పర్వతాన్ని ఎక్కేది. ఒక్కోసారి మమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఎప్పుడో అనుకున్న స్థానాన్ని చేరుకునేది. ఒకసారైతే రెండ్రోజులు మంచులోనే ఉండిపోయింది’ అని వార్గోవ్‌‌‌‌ చెప్పారు. మీరాను బేస్‌‌‌‌క్యాంప్‌ మేనేజర్‌‌‌‌ కాజీ షేర్పా దత్తత తీసుకున్నారని, ప్రస్తుతం తను ఖాట్మండూలో నివసిస్తోందని వార్గోవ్‌‌‌‌ చెప్పారు. మీరా పేరును ‘బరు’గా ఆయన మార్చారన్నారు. అంటే బరుంట్సే పర్వతానికి గుర్తుగా అన్నమాట.