రెజ్లర్ సుశీల్‌‌ కుమార్‌‌కు షాకిచ్చిన WFI

రెజ్లర్ సుశీల్‌‌ కుమార్‌‌కు షాకిచ్చిన WFI

ట్రయల్స్‌‌ వాయిదా వేయలేమని ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియాకు రెండు ఒలింపిక్‌‌ మెడల్స్‌‌ అందించిన సుశీల్‌‌ కుమార్‌‌కు రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌ఐ) షాకిచ్చింది. 74 కేజీ కేటగిరీల్లో తన ట్రయల్స్‌‌ వాయిదా వేయాలని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. చేతి గాయం కారణంగా సుశీల్‌‌ ప్రస్తుతం రెజ్లింగ్‌‌కు దూరంగా ఉన్నాడు. దీంతో శుక్రవారం నుంచి జరిగే ట్రయల్స్‌‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. అయితే మెన్స్‌‌ ఫ్రీస్టయిల్‌‌లో ఐదు, గ్రీకో రోమన్‌‌లో ఆరు ఒలింపిక్‌‌ కేటగిరిలకు సంబంధించిన ట్రయల్స్‌‌ యథావిధిగా జరుగుతాయని డబ్ల్యూఎఫ్‌‌ఐ ప్రెసిడెంట్‌‌ బ్రిజ్‌‌ భూషణ్‌‌ శరణ్‌‌సింగ్‌‌ ప్రకటించాడు. ఈ ట్రయల్స్‌‌లో విజేతలుగా నిలిచిన రెజ్లర్లు ఈనెల 15–18 తేదీల్లో రోమ్‌‌లో జరిగే టోర్నమెంట్‌‌లో, ఫిబ్రవరి 18–23 వరకు ఢిల్లీలో జరిగే ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో, మార్చి 27–29 తేదీల్లోజరిగే ఏషియన్‌‌ ఒలింపిక్‌‌ క్వాలిఫయర్స్‌‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌‌ టికెట్‌‌ దక్కించుకునేందుకు సుశీల్‌‌కు మార్చిలో మరో అవకాశం ఉంది. ఇప్పటికే ఒలింపిక్‌‌ టికెట్‌‌ దక్కించుకున్న రవి దహియా (57 కేజీ), దీపక్‌‌ పూనియా (86 కేజీ), వినేశ్‌‌ ఫోగట్‌‌ (53 కేజీ)ను కూడా ట్రయల్స్‌‌లో పాల్గొనాలని డబ్ల్యూఎఫ్‌‌ఐ సూచించింది. రోమ్‌‌, ఢిల్లీలో జరిగే ఈవెంట్ల కోసమే వీరు ట్రయల్స్‌‌లో పాల్గొంటారు.