నేను పదవిలో ఉన్నంత వరకు మిమ్మల్ని అణుబాంబుల్ని తయారు చేయనివ్వ : ట్రంప్ వార్నింగ్

నేను పదవిలో ఉన్నంత వరకు మిమ్మల్ని అణుబాంబుల్ని తయారు చేయనివ్వ : ట్రంప్ వార్నింగ్

అమెరికాపై ఇరాన్​ ప్రతీకార దాడులు చేసింది. తమ మిలిటరీ కమాండర్​ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్​​లోని రెండు అమెరికా మిలిటరీ బేస్​లపై మిస్సైళ్లతో ఎటాక్​ చేసింది. ఈ దాడుల్లో 80 మంది అమెరికా సోల్జర్లు చనిపోయారని ఇరాన్​ బుధవారం ప్రకటించింది. అయితే ఇరాన్​ చేసిన దాడుల్లో అమెరికా సైనికులెవరూ గాయపడలేదని ఆ దేశ ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఎర్లీ వార్నింగ్​ సిస్టమ్​తో ముందే సైనికులందరినీ తరలించామని చెప్పారు. తాను ప్రెసిడెంట్​గా ఉన్నంత కాలం ఇరాన్​ను న్యూక్లియర్​ బాంబు తయారు చేయనివ్వబోనని ప్రకటించారు. మిడిల్​ఈస్ట్​లో టెన్షన్ల​ నేపథ్యంలో ఇరాక్​కు వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

వాషింగ్టన్​: ఇరాన్​ మిలటరీ కమాండర్​​ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని  ముందుగా ప్రకటించినట్టుగానే ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై  ఇరాన్​ మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో  80 మంది అమెరికన్​ సోల్జర్లు  చనిపోయారని ఇరానియన్​​ స్టేట్​ మీడియా బుధవారం ప్రకటించింది.  ఇరాక్​లోని  అల్​ అసద్​, ఇర్బిల్​ ఎయిర్​బేస్​లపై  22 మిస్సైళ్లతో ఎటాక్​ చేసినట్టు  తెలిపింది. ఈ  ఎటాక్స్​లో  హెలికాప్టర్లు, ఇతర మిలటరీ పరికరాలు దెబ్బతిన్నట్టు పేర్కొంది.   ప్రతీకార చర్యలకు దిగితే   పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్​ వార్నింగ్​ ఇచ్చింది. ఈ ప్రాంతంలో అమెరికా, దాని సంకీర్ణ దళాలకు చెందిన 140 టార్గెట్​లను గుర్తించామని, అమెరికా మరోసారి తప్పుచేస్తే వీటిపై ఎటాక్​ చేస్తామని రివల్యూషనరీ గార్డ్స్​ వర్గాలు తెలిపాయి.   ఇరాక్​లోని  అల్​ అసద్ బేస్ పై 15 మిసైళ్లతో దాడులు చేసినా… అమెరికన్​ ఆర్మీ మాత్రం తమ రాడార్లతో వాటిని గుర్తించలేకపోయిందని చెప్పాయి. మిసైళ్ల​ దాడి అమెరికాకు ‘‘ చెంప దెబ్బ” అని టెహ్రాన్​ తెలిపింది.

మాకు నష్టం జరగలే: ఇరాక్​

మంగళవారం రాత్రంతా జరిగిన ఇరాన్​ మిస్సైళ్ల   దాడుల్లో  తమ సైన్యానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని ఇరాక్​ ఆర్మీ వర్గాలు చెప్పాయి. మంగళవారం రాత్రి 1: 45 నుంచి 2: 15 వరకు 22 మిసైళ్ల దాడులు జరిగాయని తెలిపాయి. తమ దేశంలో ఉన్న యూఎస్​ సైనిక స్థావరాలపై మిసైళ్ల దాడి చేసి తీరుతామని  ఇరాన్​  తమకు ముందుగానే చెప్పిందని ఇరాక్​​ ప్రకటించింది.  ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ తమకు మెసేజ్​ ఇచ్చిందని ఇరాక్​ ప్రధాని ఆఫీస్​  తెలిపింది. అయితే లోకేషన్ల వివరాలు మాత్రం వెల్లడించలేదని  పేర్కొంది.

నష్టాన్ని అంచనా వేస్తున్నాం: అమెరికా

మిసైళ్ల ఎటాక్​లో 80 మంది సోల్జర్లు చనిపోయిన వార్తను ఖండించకపోయినా…యుద్ధంలో జరిగిన నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నామని  అమెరికా డిఫెన్స్​  వర్గాలు తెలిపాయి.   ఐఎస్​ టెర్రర్​ గ్రూప్​కు వ్యతిరేకంగా ‘ ఇంటర్నేషనల్​ కూటమి’ లో భాగంగా  ఇరాక్​లో  5 వేలమంది అమెరికన్​ సైనికులు ఉన్నారు.

అమెరికాకు చెంపదెబ్బ: ఖమైనీ

మిస్సైళ్ల దాడిపై ఇరాన్​ సీనియర్​ నేత అలీ ఖమైనీ రియాక్ట్​ అయ్యారు. లైవ్​ టెలికాస్ట్​లో లో ఖమైనీ మాట్లాడారు. ‘‘మంగళవారం చెంప దెబ్బ మాత్రమే కొట్టాం. సులేమానీ హత్య తర్వాత  మన డ్యూటీ ఇప్పుడు ఏంటి అన్నదే ఇంపార్టెంట్​ ఇష్యూ.  ఇలాంటి  మిలటరీ  యాక్షన్​ సరిపోదు”అని ఖమైనీ  చెప్పారు.

ఫారెన్​ మినిస్ట్రీ ట్రావెల్​ అడ్వైజరీ

ఇరాన్​ మిసైళ్ల ఎటాక్  నేపథ్యంలో  ఇరాక్​లో నెలకొన్న టెన్షన్​ పరిస్థితులపై మనదేశం రియాక్ట్​ అయింది.   ట్రావెల్​ అడ్వైజరీని  మన ఫారెన్​ మినిస్ట్రీ జారీచేసింది. ఇరాక్​లో టెన్షన్​ ఉన్నందున మనవాళ్లు  ఆదేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని   తెలిపింది.  తర్వాతి నోటిఫికేషన్​  వచ్చేవరకు  ఇరాక్​కు ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చింది.  ఇరాక్​లోని మనవాళ్లు ఎలర్ట్​గా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని తెలిపింది.  బాగ్దాద్​లోని ఎంబసీ అక్కడున్న మనవాళ్లకు  అండగా ఉంటుందని  పేర్కొంది. మిడిల్​ఈస్ట్​లో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పలు ఎయిర్​లైన్స్​ సంస్థలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. ఇరాన్​, ఇరాక్​, గల్ఫ్​ ఎయిర్​స్పేస్​లోకి విమానాలను పోనీయొద్దని కేంద్రం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇలాంటి చర్యలొద్దు: బ్రిటన్, ఇజ్రాయిల్​​

అమెరికాపై ఇరాన్​ దాడుల్ని బ్రిటన్​ ఖండించింది.  మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని బ్రిటన్​ ఫారెన్​ మినిస్టర్​ డొమనిక్​ రాబ్​ ఇరాన్​కు వార్నింగ్​ ఇచ్చారు.  యుద్ధం వస్తే  ఐసిస్​, ఇతర టెర్రర్​ గ్రూపులకు మాత్రమే ఉపయోగముంటుందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్​ కూడా ఈ చర్యను తప్పుపట్టింది.