టైటిల్‌‌ గ్యారంటీ డౌటే?

టైటిల్‌‌ గ్యారంటీ డౌటే?
  • కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌, సమగ్ర భూ సర్వేపై సర్కారు మల్లగుల్లాలు
  • ఇప్పటికే 90 శాతం భూములకు కొత్త పాస్‌‌‌‌‌‌‌‌ బుక్కులు
  • మళ్లీ కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ ఎందుకనే ఆలోచన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భూమి అమ్మకం, కొనడంలో అమలులో ఉన్న సేల్‌‌‌‌‌‌‌‌ డీడ్‌‌‌‌‌‌‌‌, ఆర్వోఆర్‌‌‌‌‌‌‌‌ స్థానంలో కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ తీసుకురావాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా భూరికార్డుల ప్రక్షాళనలో 8-0 నుంచి 90 శాతం భూములకు బయోమెట్రిక్ ఆధారంగా కొత్త పాస్‌‌‌‌‌‌‌‌ బుక్కులిచ్చేశారు. భూముల వివరాలన్ని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. ఈ నేపథ్యంలో మళ్లీ కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం ఎందుకని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నట్లు తెలిసింది. భూవివాదాల శాశ్వత పరిష్కారం, భూమిపై ప్రజల హక్కుల రక్షణకు కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ జారీ చేయాలని కొన్నాళ్లుగా రెవెన్యూ సంఘాలు, న్యాయ నిపుణులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్చ దేశవ్యాప్తంగా  నాలుగు దశాబ్దాలుగా నడుస్తోంది.

మన దగ్గరే మొదలైనా..

దేశంలోనే తొలిసారి కంక్లూజివ్ టైటిల్‌‌‌‌‌‌‌‌ జారీ దిశగా అడుగులు పడింది కూడా మన రాష్ట్రంలోనే. ఉమ్మడి ఏపీలో 2004లో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ‘భూ భారతి’ పేరిట పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు ప్రారంభించారు. అప్పుడు సమగ్ర భూసర్వే చేసినా కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ దశకు రాకముందే అది నిర్లక్ష్యానికి గురైంది. తర్వాత  కొత్త రెవెన్యూ పాలసీ తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. అప్పటినుంచే టైటిల్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ తెరపైకొచ్చింది. అయితే ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళన పేరిట పాత పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలను రద్దు చేసి కొత్తవి ఇవ్వడంతోపాటు  సాదాబైనామాతో భూములు కొన్న వారికీ పాస్‌‌‌‌‌‌‌‌బుక్కులు ఇచ్చారు. వీటి ముద్రణ, సెక్యూరిటీ ఫీచర్స్‌‌‌‌‌‌‌‌ కోసం రూ. కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అందుకే కంక్లూజివ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు మళ్లీ పాస్‌‌‌‌‌‌‌‌బుక్కులు మార్చడం వ్యయ, ప్రయాసతో కూడిన వ్యవహారమని భావిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా టైటిల్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీ ఇవ్వాలంటే సమగ్ర భూసర్వే చేయాల్సి ఉంటుందని, దీంతో రైతుల మధ్య కొత్త వివాదాలు రావొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సమగ్ర భూసర్వే చేయాలా ? వద్దా అని తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. 112 చట్టాలు, వేలాది జీవోలను క్రోడీకరించి భూముల మ్యుటేషన్‌‌‌‌‌‌‌‌లో వేగం, అవినీతిరహిత సేవలను ఎలా అందించాలనే అంశాలతో కొత్త రెవెన్యూ బిల్లును తీసుకొచ్చేందుకు సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ల్యాండ్‌‌‌‌‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునళ్లు

సివిల్‌‌‌‌‌‌‌‌ కోర్టుల్లో లక్షలాది భూవివాదాలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో కొత్తవీ నమోదయ్యాయి. ఈ వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్‌‌‌‌‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. జిల్లా ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ లేదా జాయింట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను చైర్మన్‌‌‌‌‌‌‌‌గా, రాష్ట్ర స్థాయి అప్పిలేట్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు సీనియర్‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌ జడ్జిని చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ట్రిబ్యునళ్లతోపాటు హైకోర్టులో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలనీ రెవెన్యూ బిల్లులో చేర్చినట్లు తెలుస్తోంది.

TS Govt. step back on Conclusive titles, Land Survey