రెండేళ్ల తర్వాత పెండింగ్ వాటర్ బిల్లులంటూ నోటీసులు

రెండేళ్ల తర్వాత పెండింగ్ వాటర్ బిల్లులంటూ నోటీసులు
  •     కంటోన్మెంట్ వాటర్ బోర్డు అధికారుల నిర్వాకం

సికింద్రాబాద్, వెలుగు: కంటోన్మెంట్ పరిధిలోని వాటర్ బోర్డు అధికారుల తీరుపై  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఒక్కో నల్లా కనెక్షన్ పై పెంచిన రూ. 135 వసూలు చేయటంలో నిర్లక్ష్యం వహించిన అధికారులు ఇప్పుడు ఆ మొత్తం చెల్లించాలంటూ జనాలకు నోటీసులు జారీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలు, ఇళ్లకు వాటర్ బోర్డు నుంచి నీటిని సేకరించి కంటోన్మెంట్ బోర్డు నల్లా కనెక్షన్లు ఇస్తుంది. ఒక్కో కనెక్షన్ కు రూ. 315 కాగా 2018 జులై నుంచి రూ. 135 పెంచారు. దీంతో ఒక్కో కనెక్షన్ కు రూ. 450 చెల్లించాల్సి ఉంది. కానీ పెంచిన బిల్లుల వసూళ్ల విషయంలో కంటోన్మెంట్ అధికారులు ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. తాజాగా 27 నెలల బిల్లు పెండింగ్ ఉందంటూ నోటీసులు జారీ చేశారు. ఒక్కో కనెక్షన్ కు రూ.3,645 పెండింగ్​లో ఉన్నాయంటూ వెంటనే కట్టాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు పెంచిన బిల్లు విషయమే తమకు తెలియదని, ఇన్నాళ్లు బిల్లు పెంచిన సంగతి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీనిపై కంటోన్మెంట్ బోర్డు 5 వ వార్డు పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీ వాసులు శనివారం సమావేశమయ్యారు. పెంచిన బిల్లుల వసూళ్లను నిలిపివేయాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

వచ్చే నెలలో బోర్డు అధికారుల సమావేశం

కంటోన్మెంట్​లో ఫ్రీ వాటర్ స్కీమ్ ను  అమలు చేసేందుకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో బోర్డు ప్రత్యేకంగా  సమావేశం కానుంది.  ఫ్రీ వాటర్ సప్లయ్ పై  తీర్మానం ఆమోదం పొందితే ఈ రిపోర్టును పుణెలోని కంటోన్మెంట్​ బోర్డ్స్​ సదరన్​ రీజియన్​ ప్రిన్సిపల్​ డైరెక్టర్ జనరల్​కు పంపి.. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే  ఇక్కడ అమలు చేస్తామని అధికారులు తెలిపారు.