బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యవేదిక

బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యవేదిక
  •  సీపీఎం జనరల్​ సెక్రటరీ  సీతారాం ఏచూరి
  • అందుకు కమ్యూనిస్టు పార్టీలు బలపడాలని పిలుపు
  • పార్టీ రాష్ట్ర మూడో మహాసభలు మొదలు

హైదరాబాద్​, వెలుగు: మత, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య వేదిక ఏర్పడాల్సిన అవసరముందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే అందుకు ఏకైక మార్గమన్నారు. దానికి కమ్యూనిస్టు పార్టీలు బలపడాలని, లౌకికవాదులను కలుపుకొని పోవాలని ఆయన సూచించారు. ఆదివారం హైదరాబాద్​లోని తుర్కయాంజాల్​లో సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ సీనియర్​ నేత సారంపల్లి మల్లారెడ్డి సీపీఎం జెండా ఎగరేశారు. తర్వాత అమరవీరులకు పార్టీ నేతలు నివాళులర్పించారు. సభకు వచ్చిన వారికి ఎన్​95 మాస్కులు, శానిటైజర్లను అందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీతారం ఏచూరి వర్చువల్​గా మాట్లాడారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశ సంపదను మొత్తం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. మత రాజకీయాలకు పాల్పడుతూ ఆర్టికల్​ 370, ఆర్టికల్​ 35(ఎ)లను రద్దు చేసిందని, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్​పీఆర్​లను ముందుకు తెచ్చిందని విమర్శించారు.

అమెరికాకు జూనియర్​లా మోడీ సర్కార్​ వ్యవహరిస్తోందన్నారు. ఆ దేశం ముందు మోడీ తోలుబొమ్మలా ఆడుతున్నారన్నారు. దేశంలో కమ్యూనిస్టులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని సీపీఎం సభలకు హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లాగానే కలిసి మెలిసి ఉంటున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాస్​రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా నదీజలాల సమస్యను, ఇతర అంశాలను చర్చల ద్వారా తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవడం మంచిదన్నారు. ఏపీలో విశాఖ స్టీల్​ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీంఎ పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.