- 720 కోట్ల విలువైన భూములను చెరబట్టిన బీఆర్ఎస్ నేతలు
- నేలమట్టం చేసి స్వాధీనం చేసుకున్న హైడ్రా
- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో మెగా ఆపరేషన్
- 15 వేల కోట్ల విలువైన 861 ఎకరాలు స్వాధీనం
- ఆ వెంటనే కంచె వేసి కాపాడిన అధికారులు
- హైడ్రాకు మద్దతుగా ‘సేవ్ ఐలాపూర్’ అంటూ నినదించిన జనం.. రాష్ట్రంలో సంచలనం
హైదరాబాద్ సిటీ/సంగారెడ్డి, వెలుగు: అనగనగా ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లు.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ప్రధాన అనుచరులు.. పేరు ముఖీం, అజీమ్.. తమ నేత అండ చూసుకొని రెచ్చిపోయారు.. గత ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో రూ.720 కోట్ల విలువైన 40 ఎకరాలకు పైగా సర్కారు భూమిని చెరబట్టారు. అన్న 40 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని నడుమ విలాసవంతమైన ఫాంహౌస్కట్టుకుంటే.. తమ్ముడు మరోచోట 2.5 ఎకరాల్లో 3 టవర్ల అపార్ట్మెంట్కట్టి అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, నిర్మాణాలను చేపట్టినట్టు పక్కా ఆధారాలు సంపాదించిన హైడ్రా.. శనివారం వీరిద్దరి భరతం పట్టింది.
ముందస్తు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాక ఇటు గెస్ట్ హౌస్‌ను, అటు ఫాంహౌస్‌ను నేలమట్టం చేసింది. భూమిని స్వాధీనం చేసుకోవడమేగాక పనిలోపనిగా కంచె వేసి కాపాడింది. అమీన్‌పూర్ రోడ్డుకిరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను సైతం కూల్చిన అధికారులు.. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన 861 ఎకరాలను కబ్జాకోరుల నుంచి కాపాడారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ కూల్చివేతల పర్వం రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. ఈ మెగా ఆపరేషన్‌లో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫైర్, హైడ్రా కలిపి దాదాపు 2,700 మంది అధికారులు, సిబ్బంది పాల్గొనగా, ఒక బాహుబలి క్రేన్, 12 జేసీబీలు, 3 హిటాచీలు, 6 టిప్పర్లను వినియెగించారు. కాగా, ఐలాపూర్‌లో కబ్జాలు తొలగిస్తున్నంత సేపు హైడ్రా అధికారులకు స్థానిక ప్రజలు అండగా నిలిచారు. ‘సేవ్ఐలాపూర్ ’ అనే నినాదాలతో మద్దతు తెలుపుతూ పటాకలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
ఐలాపూర్‌లో హైడ్రా మెగా ఆపరేషన్..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట, ఐలాపూర్ ప్రాంతాల్లో శనివారం హైడ్రా మెగా ఆపరేషన్ చేపట్టింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల తో కలిసి భారీ యంత్ర సామగ్రితో తరలివచ్చిన హైడ్రా.. గతంలో ఎన్నడు లేని విధంగా 861 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నది. హైడ్రా కాపాడిన భూముల విలువ దాదాపు రూ.15 వేల కోట్ల వరకు ఉంటుదని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కాపాడడంతో ఐలాపూర్ గ్రామస్తులు పటాకలు కాల్చి పండుగ జరుపుకున్నారు. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో1 నుంచి 220 సర్వే నంబర్ల పరిధిలో 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఈ భూమి నిజాం పాలకుల పేరుతో రికార్డుల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్సంస్థాన విలీన ప్రక్రియతో ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చింది. కాగా, 1,263 ఎకరాల్లో 861 ఎకరాలను కొందరు బడాబాబులు రాజకీయ అండదండలతో కబ్జా చేసి దర్జాగా అనుభవిస్తున్నారు. 2013లోసర్కారుకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తూ యథాతథ స్థితి కొనగించాలని స్పష్టంచేసింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఈ భూములను హైడ్రా చెరవిడిపించింది. మిగతా భూముల్లో కొన్నిచోట్ల పేదలు కట్టుకున్న ఇండ్ల జోలికి వెళ్లలేదు.
అధికారులను అడ్డుకునే ప్రయత్నం..
‘కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్’ పేరుతో అజీమ్ నిర్మించిన రెండు అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. కాగా, వీటిని కూల్చివేయకుండా అందులో నివాసముంటున్నవారిని ముందరపెట్టి హైడ్రా అధికారులను అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇందులో ఫ్లాట్లు కొన్నవారితోపాటు అద్దెకుంటున్నవారికి హైడ్రా ముందస్తు నోటీసులు ఇచ్చి.. పథకం ప్రకారం కూల్చివేతలు చేపట్టింది. శనివారం దాకా అందులోనే ఉన్న కొందరిని పోలీసు బలగాల మధ్య ఖాళీ చేయించి మరీ టవర్లను కూల్చివేశారు. మరోవైపు ముఖీంపై ఇప్పటికే జంట హత్యలు, హత్యాయత్నంలాంటి 19కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. గతంలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉండేదన్నారు. వృత్తిరీత్యా అడ్వకేట్ అయినప్పటికీ, తనకున్న పలుకుబడితో ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు ఆరోపించారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని ధిక్కరిస్తూ ఐలాపూర్ తండా ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నట్టు తెలిపారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, దానిని 100 గజాల ప్లాట్లుగా విభజించి అమాయక గిరిజనులకు అమ్ముతున్నట్టు గూగుల్ మ్యాప్స్ ఆధారాల ద్వారా స్పష్టమవుతున్నదని వివరించారు.
హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నం
అమీన్‌పూర్ మున్సిపాల్టీలోని ఐలాపూర్ శివారులో శనివారం హైడ్రా నిర్వహించిన ఆపరేషన్‌ను స్వాగతిస్తున్నామని రాజగోపాల్‌నగర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 42 ఏండ్లనుంచి కోర్టుల చుట్టూ తిరిగిన తమకు ప్రజాప్రభుత్వ చర్యలతో భరోసా కలిగిందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి అసలు యజమానులమైన తమపై కొందరు వ్యక్తులు చేస్తున్న అన్యాయానికి ప్రభుత్వం చరమగీతం పాడాలని కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు సందీప్‌కుమార్, రవికాంత్‌రెడ్డి మాట్లాడారు. సర్వే నం.207,208లలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో అసలైన బాధితుల్లో భరోసా ఏర్పడిందన్నారు. ఐలాపూర్‌లో 408 ఎకరాల్లో 4 దశాబ్దాల క్రితమే తమ తండ్రులు సేల్‌డీడ్ ద్వార భూములు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ భూములను కొందరు వ్యక్తులు అమాయకులకు తక్కువ ధరలకు నోటరీ ద్వారా విక్రయించి.. తమను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాల్లో ఇతరులు నిర్మాణాలు చేపట్టడంతో తాము కోర్టులను ఆశ్రయించగా.. కోర్టులు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చాయన్నారు. అయినా అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నేడు ఆక్రమణలను కూల్చివేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రా కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
