కోరుట్ల, వెలుగు : పట్టాదార్ పాస్ బుక్ లో పేరును సవరించేందుకు లంచం తీసుకున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ జీపీవో రాజేశ్ ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన తండ్రికి చెందిన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
ఆ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లో తన పేరు, తండ్రి పేరు తప్పుగా పడడంతో వాటిని సరి చేయాలని మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నాడు. అనంతరం మెట్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి అధికారులను కలవడంతో ఆత్మకూర్ జీపీవో రాజేశ్ ను కలవాలని సూచించారు. దీంతో జీపీవో రాజేశ్ ను కలువగా.. అతడు భూమి మోఖాపై వెళ్లి విచారణ చేశాడు.
అనంతరం రిపోర్ట్ ను తహసీల్దార్ ఆఫీస్ లో సబ్మిట్ చేసేందుకు జీపీవో రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో మల్లేశ్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో మల్లేశ్ గురువారం ఆత్మకూర్ గ్రామ పంచాయతీలో జీపీవో రాజేశ్ ను కలిసి రూ. 5 వేలు ఇచ్చాడు.
అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు జీపీవోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం మెట్ పల్లి తహసీల్దార్ ఆఫీస్ కు తీసుకువచ్చి విచారణ జరిపారు. తహసీల్దార్, రెవెన్యూ అధికారుల స్టేట్ మెంట్లు రికార్డు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి చెప్పారు.
