- ఆయన పాటలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని వెల్లడి
- రవీంద్రభారతిలో గద్దర్ మూడో వర్ధంతి స్మారక సభ
రవీంద్రభారతి, వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్ లేని లోటు ఎప్పటికీ తీరనిదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు గద్దర్ అని కొనియాడారు. ఆయన పాటలు ప్రజా ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్యకిరణ్ గద్దర్ అధ్యక్షతన గద్దర్ మూడో వర్ధంతి స్మారక సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, మాడభూషి శ్రీధర్, మల్లెపల్లి లక్ష్మయ్య, గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా, విమలక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. గద్దర్ అంటే పాలకులకు భయమని, ప్రశ్నించే తత్వమే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందన్నారు. సమాజాన్నే తన కుటుంబంగా భావించి ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేసిన మహోన్నత వ్యక్తిగా గద్దర్ నిలిచారన్నారు.
ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడమే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ గద్దర్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్నారు. వేలాది మంది ప్రజా కళాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. సమాజంలోని రుగ్మతలను తన పాటల ద్వారా ప్రశ్నించిన గొప్ప కళాకారుడు గద్దర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సూర్యకిరణ్ గద్దర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ వద్ద గద్దర్ స్ఫూర్తివనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతి, వర్ధంతిని అక్కడే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
