సీఎంతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు..రోజు ఇద్దరం ఫోన్‌‌‌‌లో మాట్లాడుకుంటం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సీఎంతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు..రోజు ఇద్దరం ఫోన్‌‌‌‌లో మాట్లాడుకుంటం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి
  •     ఢిల్లీలో జరిగిన పార్టీ కోఆర్డినేషన్ మీటింగ్‌‌‌‌కు మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించారు
  •     కోఆర్డినేషన్ కమిటీకి సీఎం అన్ని చెప్పాల్సిన అవసరం లేదు
  •     హరీశ్ లీగల్ నోటీసులపై కోర్టులోనే కొట్లాడుతానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, తమ ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. ప్రతిరోజు ఇద్దరం ఫోన్‌‌‌‌లో మాట్లాడుకుంటామని చెప్పారు. గురువారం ఆయన గాంధీ భవన్‌‌‌‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ మీడియా తనపై ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌‌‌‌లో దొంగచాటుగా ఫిర్యాదులు చేసుకునే అలవాటు లేదని, ఏ విషయాన్నైనా బహిరంగంగా, మనిషి ముందే మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. 

ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌‌‌‌లో పలు కీలక అంశాలపై చర్చ జరిగిందని, ఆ మీటింగ్‌‌‌‌లో అందరం ఓపెన్‌‌‌‌గానే మాట్లాడుకున్నామని వివరించారు. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం ఇన్‌‌‌‌చార్జీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు. తాము మీటింగ్‌‌‌‌లో కూర్చున్న టేబుల్ ఓవెల్ ఆకారంలో ఉండడంతో వంశీచంద్ అధ్యక్షత వహించినట్లుగా అనిపించిందని, దీన్ని చూసే అందరూ పొరపడ్డారని వివరించారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఫ్లాగ్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌లు మాత్రం ఈ కమిటీ మీటింగ్‌‌‌‌లో చర్చిస్తే బాగుంటుందని అనుకున్నామని, అందరం కూర్చొని చర్చించడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోగలమని భావించినట్టు చెప్పారు. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు కాదన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని, ఆయనకు ఉండే అధికారాన్ని ఎవరు కాదనలేరని స్పష్టం చేశారు.

హరీశ్​ వెళ్లిన గుళ్లు క్షుద్ర పూజలకు ఫేమస్

హరీశ్ రావు లీగల్ నోటీసులకు భయపడేది లేదని, ఏదైనా ఉంటే కోర్టుల్లోనే కొట్లాడుతామని మహేశ్ అన్నారు. తాను ఎలాంటి అబద్ధాలు చెప్పలేదని, క్షుద్ర పూజలపై హరీశ్ వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఆయన వెళ్లిన గుళ్లు క్షుద్ర పూజలకు ప్రసిద్ధి అని, అలాంటప్పుడు ఆయన అక్కడకు ఎందుకు వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు శనో.. ఎవరు దరిద్రమో ప్రజలు ఎన్నికల్లోనే తేల్చి చెప్పారని అన్నారు. బీజేపీ నేతలు అరవింద్, సంజయ్‌‌‌‌లు తన ముందు పిల్లలు అని, వారి విమర్శల గురించి పట్టించుకోనన్నారు.