మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటి విడుదల

మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటి విడుదల

 తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయం నుంచి కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ (LMD) కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

మిడ్ మానేరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసిన అధికారులు.. ఎల్ఎండికి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో విషయానికి వస్తే.. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి భారీగా 12,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు ములవాగు, మానేరు వాగుల నుండి మరో 953 క్యూసెక్కుల ప్రవాహం మిడ్ మానేరుకు వస్తోంది.

ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 19 టీఎంసీల వరకు నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయం క్రమంగా నిండుతుండటంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో ప్రాజెక్ట్‌లకు పెరుగుతున్న ఈ నీటి ప్రవాహం స్థానిక రైతన్నల్లో, ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోంది. నీటి మట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, దిగువ ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.