- రాష్ట్రంలో అధికారం కోసం కలిసికట్టుగా పోరాడుదామని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హస్తినలో తెలంగాణ బీజేపీ రాజకీయం హీటెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాన అడ్డాగా మారింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుసగా ఎంపీలు, ఎమ్మెల్యేలు బండి సంజయ్ ఇంట్లో భేటీ కావడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మధ్యాహ్నం జరిగిన లంచ్ మీటింగ్ లో ఎంపీలు రఘునందన్ రావు, గొడెం నగేశ్ పాల్గొన్నారు.
డిన్నర్ మీటింగ్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు అరవింద్ ధర్మపురి, డీకే అరుణతోపాటు ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో క్షేత్రస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, కానీ దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విభేదాలు పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని నిర్ణయించారు.
