కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్
  • పీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో మహేశ్ గౌడ్.

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మేధావులు ముందుకు రావాలని పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో పీసీసీ మేధావుల విభాగం చైర్మన్ శ్యామ్ మోహన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. నెహ్రూ కాలం నుంచి దేశానికి కాంగ్రెస్ చేసిన సేవలను, రాజ్యాంగ సూత్రాలను, ప్రజాస్వామ్య విలువలను విస్తృతంగా ప్రచారం చేయడంలో మేధావుల పాత్ర కీలకమని తెలిపారు. 

కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని చైతన్యపరచాలని సూచించారు.లౌకికవాదం, సామాజిక న్యాయం, మత సామరస్యం, సమానత్వం, జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యాలని, వీటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో మేధావుల విభాగం జాతీయ అధ్యక్షుడు కెప్టెన్ ప్రవీణ్ దావర్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.