టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాతో వస్తున్న మూవీ ‘పళ్ల బురుసు’ (Pallaburusu). బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. వేపపుల్లతో పళ్లు తోముకోలేక ఇబ్బంది పడుతున్న తండ్రి.. తన కొడుకును టూత్ బ్రష్ కొనివ్వమని అడగడంతో మొదలైన చిన్న కోరిక, చివరకు జిల్లా కోర్టు మెట్లు ఎక్కేంత పెద్ద గందరగోళానికి ఎలా దారితీసిందన్నదే ఇన్సిడెంట్స్ తో ట్రైలర్ సరదాగా ఉంది. గ్రామంలోని మనుషులు, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు, ఊహించని పరిణామాలతో ట్రైలర్.. సినిమాపై ఆసక్తి రేపింది. సాధారణమైన అంశాన్ని వినూత్నంగా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.
మొత్తంగా.. పల్లెటూరి భాష, సహజమైన పాత్రలు, జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనలు సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తున్నాయి. కామెడీతో పాటు హార్ట్‌టచింగ్ ఎమోషన్స్‌ను సమపాళ్లలో మిళితం చేస్తూ కొత్త దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన విధానం సినిమాపై అంచనాలు పెంచింది. పవన్ సి.హెచ్. సంగీతం ట్రైలర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చింది.
‘పళ్ల బురుసు’ ఎలా ఉండబోతోందంటే?
ఈ సినిమా కథ 68 ఏళ్ల ఒంటరి వృద్ధుడు శాంభు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కథ అంతా ఒక చిన్న 'టూత్ బ్రష్'(‘పళ్ల బురుసు’ ) చుట్టూనే తిరగనుంది. వేపపుల్లతో పళ్ళు తోముకోలేక, పంటి నొప్పితో బాధపడే ఒక ముసలి రైతు (తండ్రి).. తన కొడుకును ఒక టూత్ బ్రష్ కొనివ్వమని అడుగుతాడు. అక్కడి నుంచి మొదలైన ఈ చిన్న రిక్వెస్ట్.. ఆ పల్లెటూరిలో ఎలాంటి గందరగోళానికి దారితీసింది? చివరికి ఒక టూత్ బ్రష్ కోసం తండ్రీకొడుకులు జిల్లా కోర్టు మెట్లు ఎక్కే వరకు వ్యవహారం ఎలా వెళ్ళింది? అనే పాయింట్‌ను అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ డ్రామాగా మలిచారు దర్శకుడు ఉదయ్ చౌహాన్. మరి థియేటర్లలో నవ్వుల పూలు పూయించడానికి రెడీ అవుతోన్న ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
