సెప్టెంబర్‌‌ 25, 26న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలు : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్

సెప్టెంబర్‌‌ 25, 26న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలు :  ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ లెవెల్ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను పెంపొందించేందుకు నిర్వహించే దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల షెడ్యూల్‌‌ను ఎస్సీఈఆర్‌‌టీ విడుదల చేసింది. రాష్ట్రస్థాయి పోటీలను సెప్టెంబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్‌‌లో నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ తెలిపారు. జిల్లా, మండల స్థాయి పోటీలను నిర్వహించుకొని, సెప్టెంబర్ 3లోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన జట్ల వివరాలను సెప్టెంబర్ 5లోపు రాష్ట్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. 

ఈ పోటీలకు ‘సైన్స్ అండ్ సొసైటీ’ అనే ప్రధాన అంశాన్ని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ఆవాసాలు, నదుల పునరుద్ధరణ వంటి ఉప అంశాలపై విద్యార్థులు నాటకాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని డైరెక్టర్ పేర్కొన్నారు. 

బెంగళూరులో సౌత్ ఇండియా పోటీలు

రాష్ట్రస్థాయిలో ఫస్ట్, సెకండ్  స్థానాల్లో నిలిచిన విజేతలు నవంబర్ 19, 20 తేదీల్లో బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్​మ్యూజియంలో జరిగే దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికవుతారు. అక్కడ ప్రతిభ చాటిన వారు 2027 జనవరిలో కోల్‌‌కతాలో నిర్వహించే జాతీయ స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్‌‌లో పాల్గొంటారు. నాటక ప్రదర్శన 30 నిమిషాలకు మించకూడదని, ప్రతి జట్టులో గరిష్టంగా 10 మంది సభ్యులు ఉండాలని నిబంధనలు విధించారు.