ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ..ఫోర్జరీ చేసిన కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్

ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ..ఫోర్జరీ చేసిన కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్

అబిడ్స్, వెలుగు: హైడ్రా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ ఎన్‌‌వోసీలతో ఇంటర్​బోర్డు అనుమతులు పొందేందుకు ప్రయత్నించిన ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​చేశారు. గురువారం నాంపల్లిలోని ఇంటర్​బోర్డును ముట్టడించారు. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వీతేజ మాట్లాడుతూ.. కొన్ని కాలేజీలు బోర్డు అనుమతుల కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

నగరంలో చాలా కళాశాలలు ఫైర్ సేఫ్టీ, ఆట స్థలాలు లేకుండా, శిథిలావస్థ భవనాల్లోనే కొనసాగుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఫోర్జరీకి పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరి ప్రసాద్, కోఠి జిల్లా కన్వీనర్ రేవంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజన్, నగర కార్యదర్శి సురేందర్‌‌, నాయకులు పాల్గొన్నారు.