సిద్దిపేట, వెలుగు : ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం సిద్దిపేట కలెక్టర్ కె హైమావతి అధ్యక్షతన నిర్వహించిన సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు ఆశించినంతగా జిల్లా ప్రజలకు అందడం లేదని, వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందేలా అధికారులు, డాక్టర్లు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పరిశీలించి, వాటి భర్తీకి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని, ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జ్ మంత్రికి సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పారు. పీజీ వైద్య విద్యార్థుల సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అనవసరంగా సీ-సెక్షన్ ప్రసవాలు చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ సేవలలో సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట జనరల్ ఆస్పత్రి ద్వారా జిల్లా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించాలనేదే లక్ష్యమని, ఆ దిశగా ఆస్పత్రి డాక్టర్లు సేవలందించాలని సూచించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు రెగ్యులర్ గా విధులకు హాజరు కావడం లేదని తన దృష్టికి వచ్చిందని, అందుబాటులో ఉండి అన్ని రకాల వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలని ఆదేశించారు. అనంతరం రూ. 5.49 కోట్లతో వైద్య పరికరాల కొనుగోలుకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా, సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వివరాలను సరిగా అందించడంలో విఫలమైన జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇతర డాక్టర్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత షా, డీఎం హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
కోహెడ మండలంలో మంత్రి పర్యటన
కోహెడ : కోహెడ మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టుపై న్యాయపరమైన చిక్కులు తొలగాయని, ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాలువల నిర్మాణానికి భూసేకరణ కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేసిందని, రైతులు సహకరించాలని కోరారు. కోహెడ మండలం తంగళ్లపల్లి శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. గ్రామాల్లో బోర్ వెల్ రీఛార్జి పాయింట్లు పెంచుకోవడం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే గ్రామాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
