UPI ద్వారా డబ్బు పంపితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. టాక్సెషన్ అండ్ అథర్ లా అమెండ్మెంట్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన తర్వాత యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశం ఉందన్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండగా.. కొందరు రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
నిర్మలా సీతారామన్ క్లారిటీ..
యూపీఐపై ఎండీఆర్ విధించినా అది వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ యూజర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్లమెంట్ బిల్లు చట్టంగా మారిన తర్వాత NPCI ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని తెలిపారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, సాంకేతిక అభివృద్ధిపై మరింత పెట్టుబడులు పెట్టేందుకు ఈ మార్పు ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలకు బదులుగా నిర్మలమ్మ క్లారిటీ ఇచ్చారు.
బిల్లు అసలు ఏం చెబుతోంది?
ఈ సవరణ బిల్లు వెంటనే యూపీఐపై ఛార్జీలు విధించడం కాదు. ప్రస్తుతం చట్టంలో ఉన్న జీరో-ఎండీఆర్ నిబంధనను తొలగించి, అవసరమైతే భవిష్యత్తులో ప్రభుత్వం ఎండీఆర్ అమలు చేసే అవకాశాన్ని మాత్రమే కల్పిస్తోంది. ఒకవేళ ఎండీఆర్ అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఏ లావాదేవీలపై, ఎంత శాతం, ఎవరిపై వర్తించాలనే అంశాలపై తర్వాత నెమ్మదిగా నిర్ణయం తీసుకుంటారు.
జైరాం రమేశ్ ఆందోళన ఇదే..
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ బిల్లుతో ఇప్పటి వరకు యూపీఐ ఉచితంగా ఉండే చట్టపరమైన హామీ తొలగిపోతుందని విమర్శించారు. ఎండీఆర్‌ను మొదట వ్యాపారులపై విధించినా.. చివరకు ఆ ఖర్చును వస్తువుల ధరలు పెంచి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని అన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇది కేవలం వ్యాపారులకే పరిమితం కాదని, చివరికి సామాన్య ప్రజలపైనే భారం పడుతుందని వాస్తవికతను మాట్లాడారు.
నిపుణులు ఏమంటున్నారు?
ప్రముఖ మార్కెట్ నిపుణుడు, క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ ఎండీఆర్ అవసరమైతే ఉండొచ్చని, కానీ అది లావాదేవీ విలువపై శాతం రూపంలో కాకుండా పరిమిత మొత్తంగా ఉండాలని సూచించారు. ఉదాహరణకు "రూ.5 లేదా 0.2 శాతం... రెండింటిలో ఏది తక్కువైతే అది" అనే విధానం సరైందని అభిప్రాయపడ్డారు. పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినా ప్రాసెసింగ్ ఖర్చు అంతగా పెరగదని, కాబట్టి శాతం ఆధారిత ఎండీఆర్ పాత విధానమని పేర్కొన్నారు.
పన్ను నిపుణుల హెచ్చరిక..
మర్చంట్ ఎండీఆర్ సాంకేతికంగా వ్యాపారులే చెల్లించినా, అదనపు ఖర్చును వారు వస్తువులు, సేవల ధరల్లో కలిపి వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని చార్టర్డ్ అకౌంటెంట్ హిమాంక్ సింగ్లా అన్నారు. గతంలో కూడా ఇలాంటి ఖర్చులు చివరకు వినియోగదారులపైనే పడిన ఉదాహరణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
'క్యాష్ ఈజ్ కింగ్'..
ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా భారీగానే డిస్కషన్ నడుస్తోంది. కొందరు నెటిజన్లు యూపీఐ వంటి భారీ డిజిటల్ చెల్లింపు వ్యవస్థను నిర్వహించాలంటే బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు ఆదాయం అవసరమని, అందుకే ఎండీఆర్ సమంజసమేనని అంటున్నారు. మరోవైపు చాలా మంది "ఒక్కసారి ఎండీఆర్ వస్తే అది చివరకు వినియోగదారుల జేబుకే భారం అవుతుంది" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులు ఈ ఖర్చును భరించలేక వస్తువుల ధరలు పెంచే అవకాశముందని చెబుతున్నారు. మరికొందరు డిజిటల్ చెల్లింపులకు ఛార్జీలు వస్తే ప్రజలు మళ్లీ క్యాష్ పేమెంట్స్ వైపు వెళ్లిపోతారని అంటున్నారు. అప్పుడు 'Cash is King' అనే పరిస్థితి తిరిగి వస్తుంది అంటూ పోస్టులు చేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి మాత్రం యూపీఐ ద్వారా చేసే అన్ని లావాదేవీలు వినియోగదారులకు, వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండానే ఉచితంగా కొనసాగుతున్నాయి. ఈ బిల్లు కేవలం భవిష్యత్తులో జీరో-ఎండీఆర్ విధానాన్ని పునఃసమీక్షించే అవకాశాన్ని మాత్రమే కల్పిస్తోంది. ఎండీఆర్ అమలు చేయాలా? చేస్తే ఎవరిపై? ఎంత? అనే అంశాలపై మోడీ ప్రభుత్వం, ఎన్‌పీసీఐ కమిటీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు యూపీఐ వినియోగదారులు వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో అనేది.
