ఉపాధ్యాయ సంఘాల సంఖ్య తగ్గించండి : ఎఫ్‌‌జీజీ

ఉపాధ్యాయ సంఘాల సంఖ్య తగ్గించండి : ఎఫ్‌‌జీజీ
  •     సీఎంకు ఎఫ్‌‌జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల విద్యావ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ (ఎఫ్‌‌జీజీ) ప్రెసిడెంట్ ఎం. పద్మనాభరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ సంఘాల కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు వెంటనే సంస్కరణలు చేపట్టాలని కోరుతూ గురువారం ఆయన సీఎంకు లేఖ రాశారు. శాసనమండలిలో ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నందున, ఇన్ని సంఘాల అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48 టీచర్ సంఘాలు ఉండగా, గుర్తింపు పొందేందుకు కనీసం 25 శాతం సభ్యత్వం ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ 8 సంఘాలకు గుర్తింపు లభించిందని, మరో 40 సంఘాలు నమోదై ఉన్నాయని తెలిపారు. 

సంఘాల నేతలకు విధి నిర్వహణ నుంచి మినహాయింపు ఇస్తుండడంతో, పలువురు నాయకులుగా చెలామణి అవుతూ బోధనకు దూరమవుతున్నారని విమర్శించారు. కొన్ని సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా, మరికొన్ని కులాల ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, ఇది సర్వీసు సంఘాల గుర్తింపు నియమాలకు విరుద్ధమని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న 1.30 లక్షల మంది ఉపాధ్యాయులను అవసరానికి తగినట్లు స్కూళ్లలో నియమిస్తే ఉపాధ్యాయుల కొరత తీరుతుందన్నారు. ఏటా టీచర్ల జీతాల కోసమే రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, దీంతో తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.