వెయ్యి అడుగులు తవ్వినా.. చుక్క నీరు పడ్తలే.. గోదావరి పరివాహకంలో ఇరువైపులా రాతి శిలలు

 వెయ్యి అడుగులు తవ్వినా.. చుక్క నీరు పడ్తలే.. గోదావరి పరివాహకంలో ఇరువైపులా రాతి శిలలు
  • వెయ్యి అడుగులు తవ్వినా.. చుక్క నీరు పడ్తలే.. గోదావరి పరివాహకంలో ఇరువైపులా రాతి శిలలు
  • కనిపించని భూగర్భ జలం.. సాగు నీటికి ఇబ్బందులు
  • గోదావరి నదిలో 40 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు

నిర్మల్, వెలుగు:  నిర్మల్, నిజామాబాద్ జిల్లాల మీదుగా ప్రవహించే గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఫాల్ట్ జోన్ పరిధిలోకి చేరిపోవడంతో ఈ నదికి ఇరు వైపులా కొంత దూరం వరకు వరకు చుక్క నీరు లభించడం లేదు. భూగర్భ జలాల నిల్వ ఉండడంలేదు. దీంతో బోరులు తవ్వు కొని పంటలను సాగు చేసుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల వెయ్యి అడుగుల లోతు వరకు బోర్లు తవ్వినా చుక్క నీరు బయటకు రావడం లేదు. కఠిన శిలల కారణంగా నీరు నిలకడగా ఉండక వేసవికాలంలో గోదావరి నది వెలవెలబోతోంది. పవిత్ర స్నానాలు చేసే వారికి కూడా నీరు అందుబాటులో 
ఉండడం లేదు.

నిలకడగా ఉండని నీరు

మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రవహించే గోదావరి నది వీక్ జోన్ పరిధిలో ఉన్నట్లు భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నదీ ప్రవాహం కఠిన శిలలు ఉన్న చోటు నుండే పారుతుండడం, దానికి తోడు ప్రవాహం బలహీనంగా ఉన్న కారణంగా దీన్ని ఫాల్ట్ జోన్ లేదా వీక్ జోన్ గా పేర్కొంటున్నారు. రాతిశిలల కారణంగా నీరు నిలకడగా ఉండడం లేదని, దీంతో నది పరివాహకంలో భూగర్భ జలాలు పాతాళం లోతులో కూడా కనిపించవని చెబుతున్నారు.

ఫలితంగా రెండు జిల్లాల గోదావరి పరివాహక ప్రాంతంలోని రైతులు బోరు బావులపై ఆధారపడి పంటల సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. రాతి శిలల కారణంగా గోదావరి నదికి ఆనుకొని ఉన్న పలు గ్రామాలు భూగర్భ జలాల వినియోగానికి నోచుకోలేకపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్, దూదిగామ, కొడిచెర్ల తదితర గ్రామాలతోపాటు నిర్మల్ జిల్లాలోని సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలు, సదర్మాట్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందడంలేదు. బాసర బ్రిడ్జికి నలు వైపుల నుంచి ఖానాపూర్ వరకు ఇరువైపులా రాతిశిలలు బలంగా ఉన్న కారణంగా సాగునీటికి లిఫ్ట్ ఇరిగేషన్ లే ప్రత్యామ్నాయమని అధికారులు చెబుతున్నారు. 

సోన్ గోదావరిపై చెక్ డ్యామ్ ప్రతిపాదన

గోదావరికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో లేని కారణంగా గోదావరిలో పుణ్య స్నానాల కోసం స్నాన ఘట్టాలు ఉన్నచోట చెక్ డ్యాములు నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని సోన్ గోదావరి వద్ద గల స్నానగట్టం సమీపంలో దాదాపు 100 మీటర్ల పొడవుతో నదికి అడ్డంగా చెక్ డ్యామ్ నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు గాను దాదాపు రూ.40 కోట్లతో ఇరిగేషన్ శాఖ అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది.

బోర్లు తవ్వొద్దని రైతులకు చెప్తున్నాం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరి పరివాహకంలో రాతి శిలల బ్లాక్ ఉన్నట్లు తేలింది. ఈ కఠిన శిలల ఉన్న చోటు నుంచే గోదావరి నది ప్రవాహిస్తుంది. నది కిరువైపులా కఠిన శిలలున్న కారణంగా భూగర్భ జలం అందుబాటులో లేకుండా పోతోంది. రైతులు వెయ్యి మీటర్ల వరకు బోరుబావులు తవ్వినా నీరు అందడం లేదు. బోరు బావులు తవ్వొద్దంటూ రైతులకు సూచిస్తున్నాం.- శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్, నిర్మల్