- సెప్టెంబర్ 15 న అమల్లోకి 'ఫైనల్ రూల్'
- ఆలోపే వచ్చేయండి.. స్వదేశాలకు
- వెళ్లిన స్టూడెంట్లకు వర్సిటీల పిలుపు
వాషింగ్టన్: అమెరికాలో చదవాలనుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఆ దేశ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) షాకిచ్చింది. ఇప్పటివరకున్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో 'ఫిక్స్డ్ టైమ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్ (ఫైనల్ రూల్)' అనే చట్టబద్ధమైన కొత్త నిబంధనను సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ నేపథ్యంతో యూఎస్ లో చదువుతూ సెలవులకు స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులంతా సెప్టెంబర్ 15 లోపే తిరిగి వచ్చేయాలని అమెరికాలోని యూనివర్సిటీలు పిలుపునిచ్చాయి.
తమకు అందుతున్న సదుపాయాలు నిలిచిపోకూడదంటే విద్యార్థులంతా డెడ్‌లైన్ లోపే క్యాంపస్‌లకు చేరుకోవాలని వర్సిటీలు స్పష్టం చేశాయి. ప్రసిద్ధ కొలంబియా యూనివర్సిటీ తమ విద్యార్థులకు ముందస్తు నోటీసులు పంపింది. తరగతులు మొదలయ్యే సెప్టెంబర్ 8 నాటికే న్యూయార్క్ చేరుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఏమిటీ కొత్త నిబంధన!
డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పద్ధతి ప్రకారం.. కోర్సు ఎంతకాలం సాగితే అంతకాలం విద్యార్థి అమెరికాలో నివసించే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం.. ఎఫ్-1, జే-1, ఐ(I) వీసాదారులు ఇకపై గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండి చదువుకోగలుగుతారు. చదువు ముగిసిన తర్వాత అమెరికా విడిచి స్వదేశం వెళ్లేందుకు గతంలో 60 రోజుల సమయం ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 30 రోజులకు కుదించారు.
ఒకవేళ కోర్సు గడువు 4 ఏళ్లకు మించితే.. పొడిగింపు కోసం 'యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్' (యూఎస్సీఐఎస్)కు ఫారమ్ I-539 ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందడం తప్పనిసరి చేశారు. ఇప్పటికే అమెరికాలోనే ఉన్న విద్యార్థులకు కొంత ఉపశమనం లభించనుంది. వారు తమ ఫారమ్ I-20లో ఉన్న కోర్సు ముగింపు తేదీ వరకు లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ముగిసే వరకు కొనసాగవచ్చు. ఈ సదుపాయం కూడా గరిష్టంగా నవంబర్ 14, 2030 వరకు మాత్రమే వర్తిస్తుంది.
అయితే, సెలవుల కోసం స్వదేశాలకు వెళ్లిన ప్రస్తుత విద్యార్థులు ఒకవేళ సెప్టెంబర్ 15 తర్వాత అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో దిగితే.. అధికారులు వారిని కొత్తగా ప్రవేశిస్తున్న విద్యార్థులుగానే పరిగణిస్తారు. దీనివల్ల వారు పాత మినహాయింపులను కోల్పోయి, నేరుగా కొత్త 4 ఏళ్ల కఠిన నిబంధన కిందకే వస్తారు. అందుకే సెప్టెంబర్ 15 లోపే అమెరికా సరిహద్దులు దాటాలని తమ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు సూచించాయి.
