- త్వరలోనే 120 డాలర్లు దాటే ప్రమాదం
- 45 శాతం వరకు తగ్గిన సరఫరా
- పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పరేషాన్
- గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశం నెత్తిన మరోసారి చమురు పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్నియంత్రిత హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగితే నాలుగో క్వార్టర్లో బ్యారెల్ క్రూడాయిల్‌ధర 120 డాలర్లు దాటే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. యూఎస్–ఇరాన్మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు , పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా భారీగా తగ్గిపోవడంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ధర 89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే పర్షియన్ గల్ఫ్ నుంచి సరఫరా 45 శాతం పడిపోయింది. ఘర్షణల నేపథ్యంలో క్రూడ్ ధరల పెరుగుదలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇరాన్ తో ఘర్షణల సమయంలో క్రూడ్ ధరలు 150 డాలర్లు లేదా 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. ఈ అంచనాలు పూర్తిగా నిజం కాలేదు కానీ, బ్రెంట్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 126 డాలర్ల వరకు వెళ్లింది. మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గితే నాలుగో క్వార్టర్లో బ్రెంట్ క్రూడ్ సగటున 80 డాలర్లు , వచ్చే ఏడాది 75 డాలర్లు ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది.
హార్ముజ్ జలసంధిలో నిరంతర అంతరాయాలు , ఎర్రసముద్రంలో రవాణా సమస్యల కారణంగా ధరలు పెరిగే రిస్కులు కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు నిల్వలు తక్కువగా ఉండటం వల్ల డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా ఉండటం లేదు. చైనా దిగుమతులు తగ్గడం కొంతవరకు ఊరటనిచ్చినా, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ధరలు దూసుకెళ్తున్నాయి.
- ఒక్క డాలర్ పెరిగినా ఇబ్బందే..
మనదేశం తన ముడిచమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరగడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. క్రూడ్ ధర ఒక్క డాలర్ పెరిగినా మన వార్షిక దిగుమతి బిల్లు దాదాపు రెండు బిలియన్ డాలర్లు (రూ. 19,250 కోట్లు) పెరుగుతుంది. గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే నౌకామార్గాల్లో అంతరాయాలు ఏర్పడితే రవాణా , మెరైన్ ఇన్సూరెన్స్ ఖర్చులూ విపరీతంగా పెరుగుతాయి. ప్రపంచంలోని ఐదో వంతు చమురు హార్ముజ్ జలసంధి మీదుగా సరఫరా అవుతోంది. భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్లో 40 శాతానికి పైగా ఇదే మార్గం ద్వారా వస్తుంది. చమురు ధరల నిరంతర పెరుగుదల రూపాయికి గొడ్డలిపెట్టు అవుతుంది.
దిగుమతుల కోసం మరిన్ని డాలర్లు అవసరమవుతాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు విస్తరిస్తుంది. రూపాయి విలువ పడిపోతుంది. జీడీపీ వృద్ధి తగ్గుతుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై లీటరుకు రూ.10 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. మిడిల్ఈస్ట్లో భారత్‌కు ఉన్న వాణిజ్య, ఇంధన , కార్మిక సంబంధాలు కూడా ఈ ఉద్రిక్తతల వల్ల ప్రభావితమవుతున్నాయి.
