వర్షం.. హర్షం! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు కొనసాగే చాన్స్

వర్షం.. హర్షం! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు కొనసాగే చాన్స్
  • మంచిర్యాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు
  • ఇవాళ కూడా భారీ వర్షాలుంటాయన్న ఐఎండీ
  • నేడో రేపో బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి చాన్స్​
  • మహారాష్ట్రకు రెడ్​ అలర్ట్​ జారీ.. రేపు ఆరెంజ్ అలర్ట్​
  • అక్కడ అతిభారీ వర్షాలు పడితే నదులకు వరదలు

హైదరాబాద్/తిర్యాణి/ వెంకటాపురం/ నేరడిగొండ, వెలుగు: 
ఇన్నాళ్లూ బ్రేక్​ఇచ్చిన వర్షాలు.. ఇప్పుడు కొంచెం ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మబ్బులు దట్టంగా కమ్ముకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఆ వానలు మంగళవారం కూడా కొనసాగాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడగా.. దక్షిణ తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో రైతులతో పాటు సామాన్య జనాలూ ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు ఎగువన మహారాష్ట్రలోనూ వర్షాలు భారీగానే పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు అటు ఎగువన, ఇటు మన రాష్ట్రంలోనూ వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం లేదా గురువారం నాటికి బంగాళాఖాతంలో 
మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కొంత మెరుగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 

ఈ వర్షాకాలంలో తొలిసారి అతిభారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి అతిభారీ వర్షపాతం నమోదైంది. ఇటు పెద్దపల్లి, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా జనకాపూర్​లో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా కోటపల్లిలో 12.2 సెంటీమీటర్లు, తాండూరులో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అదే జిల్లా దేవులవాడలో 11.2 సెంటీమీటర్లు, బెల్లంపల్లిలో 11.2, పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​లో 10.8, ములుగు జిల్లా వెంకటాపూర్​లో 10.3, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బనలో 9.3, జయశంకర్​భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 9.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా తప్ప రాష్ట్రమంతటా చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్​ సిటీలోనూ సాయంత్రం దట్టంగా మబ్బులు కమ్మేసి మోస్తరు వర్షం కురిసింది. 

రేపు భారీ వర్షాలు.. తర్వాత మామూలు వానలు

రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. బుధవారం తర్వాత మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.

నదుల్లో ప్రవాహాలకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర వెస్టర్న్​ ఘాట్స్​లోనూ వర్షాలు దండిగా పడతాయని ఐఎండీ వెల్లడించింది. బుధవారానికిగానూ మహారాష్ట్రకు రెడ్​ అలర్ట్​ను జారీ చేసింది. ఆ తర్వాత గురువారానికి ఆరెంజ్​అలర్ట్​ను ఇష్యూ చేసింది. మరో రెండు రోజులకు ఎల్లో అలర్ట్​ను ఇచ్చింది. మొత్తంగా 25వ తేదీ వరకు మహారాష్ట్రలో వర్షాలు బాగానే పడతాయని ఐఎండీ తెలిపింది. అంచనాల మేరకు ఎగువన మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురిస్తే ఇటు కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

దుంకుతున్న జలపాతాలు.. 

మొన్నటి దాకా వానలు లేక వెలవెలబోయిన జలపాతాలు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు  కొండల మీద నుంచి  పరవళ్లు తొక్కుతూ దుంకుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం జలకళ సంతరించుకుంది. జలపాతానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఆకుపచ్చని చెట్లు, ప్రకృతి సోయగాలు, జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అసిఫాబాద్​ జిల్లా తిర్యాణి మండలం గుండాల, చింతలమాదర గ్రామాల సమీపంలోని గుండాల, పందిరిమాదర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.

ములుగు జిల్లాలో   తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బొగత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి  నురగలు కక్కుతూ కిందకు దుంకుతోంది.  జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రొటెక్షన్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, సెల్ఫీ స్పాట్‌‌ల మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకులను దూరం నుంచి చూసివెళ్లాలని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.