- అభ్యర్థి ఎంపిక, గెలుపు వ్యూహంపై మూడు జిల్లాల నేతలతో చర్చ
- హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి: భట్టి
హైదరాబాద్, వెలుగు: నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం రాత్రి ప్రజాభవన్‌లో సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై నేతల అభిప్రాయాలను భట్టి అడిగి తెలుసుకున్నారు.
మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు నేతలంతా సమన్వయంతో పనిచేయాలని భట్టి సూచించారు. మూడు ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థి ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని భట్టి స్పష్టం చేశారు.
పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్, అభ్యర్థి ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో చర్చించడం ద్వారా ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
