- అకౌంట్లలోకి 15 రోజుల్లోనే పైసలు.. లేటయితే ఆఫీసర్ల జీతాల నుంచే కట్
- రూల్స్‌మీరితే 10 వేల ఫైన్.. ఒంటరి మహిళలు, దివ్యాంగులకు జీఆర్జీ కార్డులు
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతోపాటు శాశ్వత ఆస్తుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ (వీబీ-జీ రామ్ జీ) పేరుతో సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఇందులో కూలీలకు పని దినాలు పెంచడంతో పాటు నిధులు, వసతులు, నిఘా విషయంలో కఠినమైన రూల్స్ పెట్టారు. పనుల్లో కాంట్రాక్టర్లు, భారీ యంత్రాల వాడకాన్ని నిషేధించారు. పనులన్నీ కూలీల చేతిపని ద్వారానే నిర్వహించాలని, ఇంటికి 5 కిలోమీటర్ల లోపలే పని చూపించాలని రూల్స్ పెట్టారు. అంతకంటే ఎక్కువ దూరమైతే 10% అదనపు రవాణా చార్జీలు ఇవ్వనున్నారు.
కొత్త జీఆర్జీ కార్డులు
కూలీలందరికీ 'గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ' (జీఆర్జీ) కార్డులను మూడేండ్ల కాలపరిమితితో ఉచితంగా అందజేస్తారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, బలహీన గిరిజన తెగలకు (పీవీటీజీ) ప్రాధాన్యతనిస్తూ వేర్వేరు రంగుల్లో కార్డులను జారీ చేయనున్నారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధి పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. వ్యవసాయ పనుల పీక్ సీజన్‌లో నాట్లు, కోతల టైంలో కూలీల కొరత రాకుండా 60 రోజులపాటు ఉపాధి పనులకు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వనున్నారు.
మస్టర్ రోల్స్ ముగిసిన 15 రోజుల్లోగా కూలీల బ్యాంకు అకౌంట్లలోకి పైసలు జమ చేయాల్సిందే. ఆలస్యమైతే 16వ రోజు నుంచి ప్రతి రోజుకు 0.05% చొప్పున కూలీలకు ఆలస్యపు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తాన్ని ముందే కూలీలకు అందించి, ఆ తర్వాత దానికి బాధ్యులైన అధికారుల జీతాల నుంచి ప్రభుత్వం రికవరీ చేయనున్నది. పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా పని చూపించకపోతే, రోజువారీ నిరుద్యోగ భృతి పొందే హక్కు కూలీలకు కల్పించింది. ఈ పథకం పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో సీఎం అధ్యక్షుడిగా ‘రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ మండలి’ ఉంటుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్టీరింగ్ కమిటీకి బాధ్యత వహిస్తారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ ప్రణాళికలను ఆమోదిస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి సామాజిక తనిఖీ నిర్వహించాలి. ఏ జిల్లాకైనా అంబుడ్స్‌పర్సన్‌ను నియమించి లోపాలను సరిదిద్దుతారు. నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్టంగా రూ.10 వేల జరిమానా విధిస్తారు. ప్రమాదవశాత్తు ఏదైనా వైకల్యం లేదా మరణం సంభవిస్తే 'పీఎం సురక్షా బీమా యోజన' ద్వారా ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు.
నాలుగు రంగాల్లో పనులు
- ఈ స్కీమ్ కింద మొత్తం 318 రకాల పనులను చేపట్టనున్నారు. వీటిని నాలుగు ప్రధాన రంగాలుగా విభజించారు.
- జల భద్రత (107 పనులు): ఇందులో చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు
- మౌలిక వసతులు (88 పనులు): ఇందులో రోడ్లు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాల నిర్మాణం.
- జీవనోపాధి వసతులు (86 పనులు): పశువుల షెడ్లు, గిడ్డంగులు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు.
- విపత్తు నివారణ (37 పనులు): వరద, తుఫాను ఆశ్రయ కేంద్రాల నిర్మాణం. గుర్తించిన పనులలో దాదాపు 82.7 శాతం పనులకు సిమెంట్, ఇసుక వంటి మెటీరియల్స్ ఉపయోగించి శాశ్వత ఆస్తులను క్రియేట్ చేయనున్నారు.
