దద్దరిల్లిన ఢిల్లీ ..ప్రధాని ఇంటి ముందు రాహుల్ ధర్నా.. అరెస్ట్

దద్దరిల్లిన ఢిల్లీ ..ప్రధాని ఇంటి ముందు రాహుల్ ధర్నా.. అరెస్ట్
  • కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతోపాటు ఎంపీలు, నేతల బైఠాయింపు
  • చేతులకు తాళ్లు కట్టుకుని మూడు గంటలపాటు ఆందోళన
  • కేరళ సీఎం సతీశన్, కర్నాటక సీఎం డీకే శివకుమార్ హాజరు 
  • కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను బర్తరఫ్ చేయాల్సిందే
  • ప్రధాని మోదీ, హోం మంత్రి షా రిజైన్ చేయాలని డిమాండ్ 
  • కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
  • రాత్రంతా ధర్నా కొనసాగిస్తానన్న రాహుల్.. అరెస్ట్ చేసిన పోలీసులు  
  • ఇది విద్యార్థులపై కాదు.. ప్రతి కుటుంబంపై జరిగిన దాడి: రాహుల్
  • మోదీ ఈసారి మౌనంతో తప్పించుకోలేరు 
  • దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి తీసుకుందని ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్ష కాంగ్రెస్​ నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్‌‌కు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ నివాసం ఎదుట ప్రతిప‌‌క్ష నేత‌‌లు మెరుపు ధర్నా చేశారు. భారీగా మోహరించిన పోలీసులు.. రాహుల్‌‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా ఇతర నేతలందరినీ బలవంతంగా అరెస్ట్ చేసి, బస్సులో తరలించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

తొలుత లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్‌‌లోని మోదీ నివాసానికి మార్చ్ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా చేతులను తాళ్లతో కట్టుకుని రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు అక్కడే బైఠాయించారు. ధర్నాలో కేరళ సీఎం వీడీ సతీశన్, కర్నాటక సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా, సమాజ్‌‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాద‌‌వ్‌‌, ఎన్‌‌సీపీ నేత సుప్రియా సూలే స‌‌హా కాంగ్రెస్‌‌ ఎంపీలు, నేత‌‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌‌ర్మేంద్ర ప్రధాన్‌‌ను తొల‌‌గించాల్సిందేన‌‌ని నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రధాని నివాసం ముందు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను మోహరించారు.

కాంగ్రెస్ నేతలు ప్రధాని ఇంటి ముందు న‌‌‌‌‌‌‌‌డి రోడ్డుపైనే దాదాపు మూడు గంటలపాటు ఆందోళ‌‌‌‌‌‌‌‌న చేప‌‌‌‌‌‌‌‌ట్టారు. దాంతో, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌‌‌‌‌‌‌‌ర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను తొల‌‌‌‌‌‌‌‌గించాల్సిందేన‌‌‌‌‌‌‌‌ని ప‌‌‌‌‌‌‌‌ట్టుప‌‌‌‌‌‌‌‌ట్టారు.

అక్కడి నుంచి నేరుగా హోం మంత్రి అమిత్ షా దగ్గరకు వెళ్లిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మళ్లీ వచ్చి రాహుల్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా.. అక్కడి నుంచి కదలబోమని ఆయన భీష్మించుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు. రాత్రంతా ధర్నాకు దిగాలని పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాద‌‌‌‌‌‌‌‌వ్‌‌‌‌‌‌‌‌, సహా కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌ర నేత‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేసి పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌లించారు.

దీంతో రాహుల్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లి బస్సులో ఎక్కించారు. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌‌‌‌‌‌‌‌జిత్ సింగ్ చన్నీ, లోక్‌‌‌‌‌‌‌‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కె. సురేష్, కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌‌‌‌‌‌‌‌జిందర్ రంధావాను కూడా పోలీసులు తరలించారు. కాగా, ధర్నా స్థలంలో సుమారు రెండు గంటలపాటు ఉన్న ఖర్గే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ తరలింపు..  

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీతో పాటు ఎంపీలను అరెస్ట్ చేసిన పోలీసులు పలు స్టేషన్లకు తరలించారు. రాహుల్‌‌‌‌‌‌‌‌ను ఛత్రసాల్ స్టేడియానికి, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు, ఇతర ఎంపీలను కింగ్స్ వే, ఎన్‌‌‌‌‌‌‌‌సీఆర్ బయటి ప్రాంతాలకు తీసుకెళ్లారు. తమ నాయకుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌కు నిరసనగా మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా ప్రారంభించారు. కాగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. అక్కడ తన కూతురు ప్రియాంకను కలిసి మాట్లాడారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను కూడా ఛత్రసాల్ స్టేడియానికి పోలీసులు తరలించారు.

ప్రతి భారతీయ కుటుంబంపై దాడి: రాహుల్ గాంధీ 

ప్రధాని ఇంటి ముందు ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో స్పందించారు. విద్యార్థుల‌‌‌‌‌‌‌‌పై దాడి అంటే ప్రతి భార‌‌‌‌‌‌‌‌తీయ కుటుంబంపై జరిగిన దాడితో స‌‌‌‌‌‌‌‌మానమ‌‌‌‌‌‌‌‌ని అన్నారు. ‘‘విద్యార్థుల‌‌‌‌‌‌‌‌పై క్రూర‌‌‌‌‌‌‌‌త్వానికి బాధ్యత వ‌‌‌‌‌‌‌‌హిస్తూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. ఇప్పటివరకు జరిగిన వైఫల్యాలపై ప్రధాని మోదీ సమాధానాలు, పరిణామాలు లేకుండా మౌనంగా ఉండి, తప్పించుకోగలనని నమ్ముతున్నారు.

కానీ ఇకపై ఆయన అలా చేయలేరు. ఈసారి అసలు సాధ్యం కాదు” అని హెచ్చరించారు. విద్యార్థులకు న్యాయం జరగాలని నమ్మే ప్రతి భారతీయుడు ప్రధాని నివాసం వెలుపల జరిగే ధర్నాలో చేరాలని పిలుపునిచ్చారు. దేశ విద్యార్థుల గొంతును విస్మరించ‌‌‌‌‌‌‌‌లేర‌‌‌‌‌‌‌‌ని స్పష్టం చేశారు. ఈ సమస్య దేశ యువత భవిష్యత్తుకు సంబంధించినదని రాహుల్ అన్నారు. పరీక్షల విధానంలోని అక్రమాలపై కాంగ్రెస్ పదేపదే ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

కానీ విద్యార్థుల సమస్యలపై ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. పోలీసులతో విద్యార్థులను కొట్టించే ఈ అరాచకాన్ని ఆపాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతోనూ మాట్లాడారు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని ఆరోపించారు.

‘‘అదానీ, అంబానీలు అపారమైన సంపదను కూడబెట్టుకోవడం చూస్తున్నాం. కానీ యువతలో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పట్ల ఆశ సన్నగిల్లింది. ఈ నిరసనలు వారిలో ఉన్న తీవ్ర అసహనానికి అద్దం పడుతున్నాయి. ఇది కేవలం విద్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేశంలో తమకు భవిష్యత్తు లేదని, తమకు ఒక భవిష్యత్తు కావాలని విద్యార్థులు చేస్తోన్న పోరాటమిది. వారి డిమాండ్ న్యాయమైనది’’ అని రాహుల్ పేర్కొన్నారు

గాయపడిన విద్యార్థులకు పరామర్శ..  

ప్రధాని నివాసానికి మార్చ్‌‌‌‌‌‌‌‌కు ముందు రాహుల్ గాంధీ లాఠీచార్జీలో గాయపడిన విద్యార్థులు, యువతను పరామర్శించారు. పార్టీ జనరల్ సెక్రటరీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌తో కలిసి గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆర్ఎంఎల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. విద్యార్థులను పరామర్శించిన తర్వాత వారికి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లతో మాట్లాడారు.

కేంద్రం ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లు

1.     కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
2.     పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి
3.     నీట్ పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌పై కేంద్రం సమాధానం చెప్పాలి
4.     ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ, హింసపై సమగ్ర దర్యాప్తు జరపాలి 
5.     బలవన్మరణం చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా ఇవ్వాలి

రాహుల్ ముక్కు నుంచి రక్తం.. 

ప్రధాని ఇంటి ముందు ధర్నా సమయంలో  పోలీసులు బలవంతంగా లాక్కెళ్లిన సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి స్వల్పంగా రక్తం కారింది. రాహుల్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్తూ, వాహనంలోకి ఎక్కించే సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల నెట్టివేత, బలప్రయోగంలో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు గాయం కావడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. పోలీసులు దౌర్జన్యం చేసినా, ముక్కు నుంచి రక్తం కారుతున్నా.. రాహుల్ గాంధీ వెనక్కి తగ్గకుండా విద్యార్థుల వైపే నిలబడ్డారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అహంకారానికి, పిరికిపంద చర్యలకు ఈ ఘటన అద్దం పడుతోందని విమర్శించారు.  

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు  

ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర నేతల అరెస్ట్‌‌‌‌‌‌‌‌లపై వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. బెంగళూరు, లక్నో, జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాట్నాలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కాగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు ఈడ్చుకెళ్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘యాద్ రఖా జాయేగా(గుర్తుంచుకుంటాం)”అని ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించింది.