ప్రైవేట్ ఆస్పత్రులు తెరుచుకోండి

ప్రైవేట్ ఆస్పత్రులు తెరుచుకోండి
  • పర్మిషన్ ఇచ్చిన యూపీ సీఎం

లక్నో: రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు కరోనా మినహా.. అన్ని రకాల ఆరోగ్య సేవలను అందించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్మిషన్ ఇచ్చారు. జిల్లాల అధికారుల సమన్వయంతో హెల్త్ సేవలను ప్రారంభించాలని డాక్టర్లకు సూచించారు. కరోనావైరస్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ.. ఓపీ సేవలు, ఆపరేషన్లు, అన్ని రకాల వైద్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లకు తక్షణం అనుమతి ఇవ్వాలని సీఎం యోగి ఈ మేరకు ఆరోగ్య శాఖను గురువారం ఆదేశించారు.

కరోనా ప్రొటోకాల్  పాటించాల్సిందే..
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన అత్యవసర, ఇతర సేవలను ప్రారంభించే ముందు అన్ని హాస్పిటల్స్, వైద్య సంస్థలు తమ సిబ్బందికి కరోనా నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. హాస్పిటల్స్ ను ప్రతిరోజు రెండు సార్లు శానిటైజ్ చేయాలని, డాక్టర్లు, సిబ్బంది నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. పేషెంట్లను చూసే క్రమంలో సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో పీపీటీ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర అవసరమైన పరికరాలు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, కరోనా అనుమానితుల సమాచారం జిల్లా అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ ప్రకారం అన్ని రిజిస్టర్డ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ లకు సబ్సిడీ రేటుకు పీపీటీ కిట్లు అందించాలని, అలాంటి ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల వరకు పొడిగించాలని మెడికల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.