లక్ష టన్నులకుపైగా యూరియా కొరత

లక్ష టన్నులకుపైగా యూరియా కొరత

ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్న రైతులు
22 జిల్లా ల్లో అసలు స్టా కే లేదు
ఫిబ్రవరిలో బాగా పెరిగిన సేల్‌
రోజూ 9వేల టన్నుల అమ్మకం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరత కలవర పెడుతోంది. సరిపడా స్టాక్‌‌ లేక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈనెల కోటా 1.75 లక్షల టన్నులు కాగా ట్రాన్‌‌సిట్‌‌ కేంద్రాల నుంచి ప్రస్తుతానికి 72 వేల టన్నులే వస్తోంది. ఇంకా లక్ష టన్నులకు పైగా అవసరముంది. యాసంగి వరి నాట్లు పెరగడంతో యూరియా, ఎరువులకు డిమాండ్‌‌ పెరిగింది. అమ్మకాలు పెరగడం, దానికి తగ్గట్టు నిల్వలు లేకపోవడంతో కొరత ఏర్పడింది.

డిమాండ్‌‌ పెరిగి..

ఈ యాసంగి సీజన్‌‌కు రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల టన్నుల యూరియా కేటాయించింది. ఇప్పటివరకు 8.51 లక్షల టన్నులు రావాల్సి ఉండగా 7.38 లక్షలు సరఫరా జరిగింది. సరఫరా పెరిగినా యాసంగి సాగు పెరగడంతో నిల్వలు చాలట్లేదు. ఈ నెల కోటా 1.75 లక్షల టన్నులు కాగా రాష్ట్రానికి రావడానికి 72 వేల టన్నులే రెడీగా ఉంది. 22 జిల్లాల్లో యూరియా స్టాకే లేదు. మిగతా 10 జిల్లాల్లో 7,337టన్నులు ఉంది. నిజామాబాద్‌‌, మిర్యాలగూడ, సనత్‌‌నగర్‌‌, జడ్చర్ల, వరంగల్‌‌, ఖమ్మం జిల్లాలకు కావాల్సిన 15 వేల టన్నుల యూరియా ర్యాక్‌‌లు కాకినాడ, జైగడ్‌‌, థాల్‌‌, చెన్నై, విజయ్‌‌పూర్‌‌, పారాదీప్‌‌ పోర్టుల నుంచి రావాల్సి ఉంది. యూరియా కొరత ఉండటంతో కొందరు బ్లాక్‌‌ మార్కెట్‌‌కు తెరలేపారు. రూ.266.50 అమ్మాల్సిన బస్తాను రూ. 360 వరకు అమ్ముతున్నారు. అయితే, బిల్లులు మాత్రం తక్కువకే ఇస్తున్నారు.

ఫిబ్రవరిలో మస్తు సేల్స్‌‌

నిరుడుతో పోలిస్తే ఈసారి అన్ని ఎరువులూ ఎక్కువగానే సేల్‌‌ అయ్యాయి. గత ఫిబ్రవరిలో 62 వేల టన్నుల యూరియా సేల్‌‌ కాగా.. ఈఏడు ఇప్పటికే 68 వేల టన్నులు అమ్ముడుపోయింది. డీఏపీ కూడా నిరుడు 5 వేల టన్నులు అమ్ముడవగా ఈఏడాది  ఇప్పటికే 7 వేల టన్నులు సేల్‌‌ అయింది. ఏంఓపీ సేల్‌‌ గతంలో 5 వేల టన్నులు.. ఈఏడు ఇప్పటికే 6,656 టన్నులు అమ్ముడయింది. ఇలా అన్ని ఎరువులు కలిపి నిరుడు ఫిబ్రవరిలో 1.09 లక్షలు సేల్‌‌ కాగా.. ఈ ఫిబ్రవరి 10 రోజుల్లోనే  1.31 లక్షల టన్నులు అమ్ముడయిందని లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 9 వేల టన్నులకు పైగా యూరియా సేల్‌‌ అవుతోంది.

కొంత మంది కొరత సృష్టిస్తున్నరు

పొలం నాట్లు పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు 50 యూరియా కట్టలు తెచ్చినం. అవసరమున్నప్పుడు దొరకట్లేదు. కొందరు కావాలని కొరత సృష్టిస్తున్నరు. రైతులు ఆందోళన చెందుతున్నరు. ప్రభుత్వం జోక్యం చేసుకొని యూరియా అందుబాటులో ఉంచాలి. కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలి.                         ‑ కవిత, మహిళ రైతు, ఖమ్మం జిల్లా