రెండేండ్లు గడిచినా పూర్తికాని నిర్మాణాలు

 రెండేండ్లు గడిచినా పూర్తికాని నిర్మాణాలు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న వెజ్‍ అండ్‍ నాన్‍వెజ్‍ ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు ఏండ్లు గడిచినా పిల్లర్లు దాటడం లేదు. కార్పొరేషన్‍, మున్సిపల్ పరిధిలో లోకల్‍ ఎలక్షన్లకు ముందు మంత్రులు హడావుడిగా ఈ పనులకు కొబ్బరికాయలు కొట్టారు. నిధుల కొరత లేదని, ఐదారు  నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకే చోట వెజ్‍, నాన్‍వెజ్‍ ఐటెంలు దొరుకుతాయని తెలిపారు. కానీ రెండేండ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. కొన్నిచోట్ల కొత్త మార్కెట్ల కట్టడానికి, పాత మార్కెట్లు కూల్చేయడంతో.. వ్యాపారులు రోడ్లపైనే అమ్ముకుంటున్నారు.

10శాతం కూడా పూర్తి కాలే..

కూరగాయలు, పండ్లు, పూలు, చేపలు, మాంసం ఇలా అన్నీ ఒకేచోట విక్రయించేందుకు సర్కారు ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌-వెజ్‌ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.542 కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణాలను ప్రారంభించింది.చాలాచోట్ల మంత్రి కేటీఆర్ దగ్గరుండి శంకస్థాపన చేశారు. ఒక్కో మార్కెట్‌కు ఎకరం నుంచి రెండెకరాల స్థలం కేటాయించారు. 25 వేలలోపు జనాభా ఉన్న ము న్సిపాలిటీల్లో రూ.2 కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.4.50కోట్లు కేటాయించారు. ప్రతి మార్కెట్‌లో షెడ్లు, కార్యాలయం, స్టోరేజీ గదులు, ప్రహరీ, మూత్రశాలలు, డ్రైనేజీ, పార్కింగ్‌, వాహనాల రాకపోకలకు అనువైన రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మార్కెట్ల వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే యూనిట్లు, బయోగ్యాస్‌ యూనిట్లు, సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కానీ రెండేండ్లుగా, ఆయా నిర్మాణాలు పూర్తి కాలేదు. కేవలం కొన్నిచోట్ల మాత్రమే వీటిని పూర్తి చేశారు.

రోజూ లొల్లి..

కొత్త నిర్మాణాల పేరుతో పాత మార్కెట్లను సర్కారు కూల్చి వేసింది. దీంతో వ్యాపారులంతా రోడ్డునపడ్డారు. వారి అడ్డాలు మారిపోయాయి. గిరాకీ తగ్గిపోయింది. కూరగాయలు, పండ్లు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తిప్పలు పడుతున్నారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో రోజూ వ్యాపారులు, అధికారుల మధ్య లొల్లి నడుస్తోంది. మార్కెట్లు ఇంకెప్పుడు కడతారు? ఇంకెప్పుడు షాపులు ఇస్తారని ఆఫీసర్లను నిలదీస్తున్నారు. మార్కెట్లు అందుబాటులోకి రాక రోడ్డుపై చెత్తచెదారం, మురికి నీళ్ల మధ్యలోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని 
వాపోతున్నారు.

తెలంగాణలోని ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు చూసి వేరే రాష్ట్రపోళ్లు ఆశ్చర్యపోతున్నరు. మోరీల పక్కన అమ్మకాలు తప్పినయ్​. డైనింగ్​టేబుల్ కాన్సెప్ట్ లా మార్కెట్లు కడుతున్నం. రాష్ట్రంలోని ప్రతి 2 లక్షల జనాభాకు ఒకటి చొప్పున వెజ్‍, నాన్‍ వెజ్‍ ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్ ఉంటది. 
– అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటలివి..

ఓరుగల్లులో ఇదీ పరిస్థితి..

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల సందర్భంగా వరంగల్​ ట్రైటిసీ పరిధిలో 5 ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. వరంగల్​లో లక్ష్మిపురం మార్కెట్, హనుమకొండ రాంనగర్‍ ఐబీ గెస్ట్ హౌజ్‍, కాజీపేట ఓల్డ్ మార్కెట్‍, కరీంనగర్‍ రోడ్డులోని చింతగట్టు కెనాల్‍ వద్ద, రంగశాయిపేట ప్రాంతంలో మొత్తం ఐదు ఇంటిగ్రేటెడ్‍ మార్కెట్ల నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టారు. లక్ష్మిపురం మార్కెట్‍ కోసం రూ.24 కోట్లు, ఐబీ గెస్ట్ హౌజ్‍ మార్కెట్‍ కోసం రూ.4.50 కోట్లు కేటాయించామని.. ఐదారు నెలల్లోనే మార్కెట్లు జనాలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కానీ రెండేండ్లు దాటినా పిల్లర్లు దాటలేదు. హనుమకొండ జిల్లా పరకాల, వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా, పనులు పూర్తికాకపోవడానికి నిధుల కొరత ప్రధాన కారణంగా తెలుస్తోంది.