అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఎదుగుతోంది

 అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఎదుగుతోంది

ముషీరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే సూపర్ పవర్ గా మన దేశం ఎదుగుతోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా డెవలప్ అవుతోందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు మూడ్రోజుల పాటు జరగనున్నాయి. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని వెంకయ్య పిలుపునిచ్చారు. యువత సంస్కృతీ సంప్రదాయాలతో పాటు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలన్నారు. దేశ భాషలు, యాసలను కాపాడేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే జాతీయ సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ వేడుకలో సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత బండ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గిరిజనులకు అంకితం: కిషన్ రెడ్డి 

దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలను అందించాల్సిన బాధ్యత మనదేనని దత్తాత్రేయ అన్నారు. భిన్న సంస్కృతులు, భాషలు దేశాన్ని ఏకం చేస్తాయన్నారు. రాష్ట్రంలోని రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఈ కార్యక్రమాలను గిరిజనులకు అంకితం ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ వేడుకలు నిర్వహిస్తోందని తెలిపారు. కాగా, అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సాంస్కృతిక మహోత్సవంలోని స్టాళ్లను సందర్శించారు. సంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.