మాజీ ఎంపీల క్వార్టర్స్​కు నీళ్లు, కరెంట్ బంద్

మాజీ ఎంపీల క్వార్టర్స్​కు నీళ్లు, కరెంట్ బంద్

న్యూఢిల్లీ: గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు లోక్​సభ హౌస్ కమిటీ షాకిచ్చింది. లుటియెన్స్ ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయని వారి క్వార్టర్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్లు కట్ చేయాలని మంగళవారం ఆదేశించింది. బీజేపీ ఎంపీ ఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన కమిటీ.. లుటియెన్స్ ఢిల్లీలో తమకు కేటాయించిన క్వార్టర్లను ఖాళీ చేసేందుకు పోలీసుల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. రూల్స్ ప్రకారం ఎంపీలు లోక్​సభ రద్దయిన నెలలోపే తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. రెండోసారి మోడీ సర్కారు ఏర్పడ్డాక.. అంతకుముందు లోక్​సభ మే 25 నాటికి రద్దయింది. ఇది గడిచి నాలుగు నెలలైనా మాజీ ఎంపీలు అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో కొత్త ఎంపీలు ఆయా రాష్ట్రాల నుంచి.. వెస్టర్న్ కోర్టులోని గెస్ట్ హౌస్​ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని ఎంపీలు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లడంతో లోక్​సభ ప్యానెల్ సీరియస్ అయింది.