హైజీన్​, ఓసీడీకి మధ్య చాలా తేడా

హైజీన్​, ఓసీడీకి మధ్య చాలా తేడా

‘నేను హైజీన్​ పర్సన్​ని. కానీ, ఓసీడీ లాంటి సైకలాజికల్​ డిజార్డర్​ నాకు లేదు’. మొన్నీమధ్య  ఓ ప్రెస్​మీట్​లో  హీరోయిన్​ రెజీనా కసాండ్రా అన్న మాటలు ఇవి. రెండూ ఒకటే కదా? అని చాలామంది అనుకుంటారు. కానీ, హైజీన్​, ఓసీడీకి మధ్య చాలా తేడా ఉంది. అందరూ ఓసీడీపై అవేర్​నెస్​ పెంచు కోవాలి అంటోంది డాక్టర్​ జ్యోతిర్మయి. 

ఓసీడీ ట్రీట్మెంట్​ కోసం క్లినిక్​కి  ఒకతను వచ్చాడు. చెకప్​ పూర్తయ్యాక.. మందులు తీసుకొని ఇంటికి బయల్దేరాడు. అతని కాళ్లకి చెప్పులు ఉన్నాయి. కానీ, డాక్టర్​ రూం బయట చెప్పులు విడిచి మర్చిపోయాడని గుర్తొచ్చింది. దాంతో బస్టాండ్​ నుంచి తిరిగి క్లినిక్​కి వచ్చాడు. అతని కాళ్లకి ఉన్న చెప్పుల్ని చూస్తున్నాడు. అయినా సరే అంతా వెతుకుతున్నాడు. అలా మూడుసార్లు చెప్పుల కోసం బస్టాండ్​ నుంచి క్లినిక్​కి​​ వచ్చాడు. 

చిన్నప్పట్నించీ చదువుల్లో ముందుండేది ఆ అమ్మాయి. కానీ, ఉన్నట్టుండి ఏదైనా తప్పు రాస్తే తట్టుకోలేకపోతుంది. నోట్​ బుక్​లో ఏదైనా అక్షరం కాస్త వంకర పోయినా లేదా..  రాత బాగా రాకపోయినా పేజీలన్నీ చింపేస్తుంది. అలానే పరీక్షలో కూడా..ఒక పేజీలో రాత సరిగా లేదని మరో పేజీ.. అక్కడ కుదరలేదని ఇంకో పేజీ ఇలా బుక్​లెట్​ అంతా వేస్ట్​ చేసింది. దాంతో చదువుల్లో వెనకబడింది. 

వయసు 65 ఏండ్లు. గోడకి ఏ చిన్న మరక లేదా గీత పడ్డా చిరాకు పడుతుంది. పెద్దపెద్దగా  అరుస్తుంది. అంతేకాదు మరకపడ్డ ఆ రూమ్​ అంతా పెయింటింగ్​ వేయించేస్తుంది. అలా ఇప్పటికి ఓ ఇరవై సార్లు హాల్​కి  రంగులు వేయించింది.
                                         
హైజీన్​ అంటే చుట్టు పక్కల దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవడం. వ్యక్తిగత శుభ్రత పాటించడం. ఓసీడీ( అబ్సెసివ్​ కంపల్సివ్ డిజార్డర్​) అనేది  ఒక మానసిక సమస్య. యాంగ్జైటీ డిజార్డర్​గా కూడా దీన్ని పిలుస్తారు. మాటిమాటికీ చేతులు, ఒళ్లు కడుక్కోవడం.. ఎవరైనా పట్టుకున్నా మురికి అయ్యామన్న భావన. చివరికి ఇంట్లోని స్విచ్​ బోర్డ్​లు, సెల్​ఫోన్​లని కూడా కడగడం.. లాంటివి ఈ డిజార్డర్​లో కనిపిస్తాయి. అయితే అతి శుభ్రత ఉన్నంత మాత్రాన దాన్ని ఓసీడీ అని చెప్పడానికి లేదు. మితిమీరిన శుభ్రత కేవలం ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి మాత్రమే. ప్రస్తుతం ప్రతి వందమందిలో ఇద్దర్ని వేధిస్తున్న ఈ సమస్యని ముందే గుర్తిస్తే.. దీన్నుంచి బయటపడటం తేలిక. 

ఓసీడీ అంటే..?

అబ్సెసివ్​ కంపల్సివ్ డిజార్డర్​లో.. అబ్సెసివ్​ అంటే మితిమీరిన ఆలోచనలు. ఈ ఆలోచనలు తప్పని తెలుసు. అవి ఎప్పటికీ నిజం కావని తెలుసు. అయినా సరే పదేపదే ఆ అనవసరమైన ఆలోచనలే వస్తుంటాయి. వీటిలో కూడా కొన్ని రకాలున్నాయి. 

కంటామినేషన్​ అబ్సెషన్​ : ఒళ్లంతా దుమ్ము, ధూళి అంటుకున్నట్టు అనిపిస్తుంటుంది.

అగ్రెసివ్​ అబ్సెషన్​: ఎవరికైనా హాని చేస్తానేమో, ఏదైనా చెడు మాట  నోటి నుంచి వస్తుందేమో , ఇంట్లోవాళ్లకి యాక్సిడెంట్​ అయిందేమో  అన్న ఆలోచనలు. 

హోర్డింగ్​ అబ్సెషన్​: అనవసరమైన వస్తువుల్ని కూడా  దాచుకోవాలి అనిపిస్తుంటుంది. సెంటిమెంట్​ అంటూ లేదా మరేదైనా కారణం చూపించి ఇల్లంతా సామాన్లతో నింపేస్తుంటారు. 

సిమెట్రీ లేదా ఆర్డరింగ్​​:   ఆ పుస్తకం అక్కడే ఉండాలి. ఈ పెన్ను ఇక్కడ మాత్రమే పెట్టాలి.. బట్టల మడత సరిగ్గా రావాలి అన్న బిహేవియర్​. 

సెక్సువల్​, బ్లాక్​ సెమీ అబ్సెషన్స్​ ​: లైంగిక పరంగా తీవ్రమైన ఆలోచనలు. 

మెడికల్​ అబ్సెషన్​:  ఏదైనా జబ్బు చేసిందేమోనని భయాలు. 

ఈ ఆలోచనల వల్ల వచ్చే  యాంగ్జైటీ, ఒత్తిడిలో చేసిన పనినే పదేపదే చేస్తుంటారు. దాన్నే కంపల్షన్​ అంటారు. అంటే దుమ్ము అంటుకుందన్న భావనతో అస్తమానం చేతులు, కాళ్లు కడుగుతుంటారు. దాన్ని వల్ల స్కిన్​ ఎలర్జీలు వస్తుంటాయి. మాటిమాటికీ వస్తువులను చెక్ చేసుకుంటుంటారు. గ్యాస్​ ​ ఆఫ్​ చేయలేదన్న అనుమానంతో రాత్రిళ్లు కిచెన్​లోకి పరుగులు తీస్తుంటారు. ఇంటికి తాళం వేసినప్పటికీ వేయలేదన్న భయంతో..ఊరెళ్లిన వాళ్లు కూడా తిరిగొస్తుంటారు. చెప్పిందే పదేపదే చెప్తుంటారు. ఆకాశంలోని నక్షత్రాల్ని లెక్కపెట్టడం, నేలమీద బండల్ని పోగుచేయడం లాంటివి చేస్తుంటారు. వీటన్నింటి వల్ల ఇంట్లో తరచూ గొడవలు అవుతుంటాయి. సోషల్, వర్క్​ లైఫ్​ పాడవుతుంది. 

ఎందుకొస్తుంది? 

ఓసీడీ ఎందుకొస్తుంది అన్నదానికి కచ్చితమైన కారణం చెప్పలేం. కానీ,  వివిధ కారణాల వల్ల  మెదడులో సరఫరా అయ్యే  సెరటోనిన్‌‌ అనే న్యూరో ట్రాన్స్‌‌మీటర్‌‌లో  వచ్చే మార్పులు ఈ సమస్యకి దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా ఓసీడీకి కారణం అవుతాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నా.. మిగతా వాళ్లకి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు..లేదా మెదడువాపు లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఓసీడీ కనిపిస్తుంటుంది. కొందరు ఆడవాళ్లలో డెలివరీ తర్వాత ఈ సమస్య మొదలవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఓసీడీకి దారితీస్తాయి. 

బయటపడేదెలా? 

లక్షణాల్ని బట్టి , డయాగ్నస్టిక్​ స్టాటికల్​ మాన్యువల్​ ఆఫ్​ మెంటల్​ డిజార్డర్​ 5 క్రైటీరియా ద్వారా  ఓసీడీని నిర్థారిస్తారు. కాగ్నిటివ్​ బిహేవియరల్​ థెరపీ ద్వారా.. పేషెంట్​ ఆలోచనల్ని, ఎమోషన్స్​ని అర్థం చేసుకుని...వాటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. యాంగ్జైటీని కంట్రోల్​ చేయడానికి ఈఎక్స్​/ ఆర్​పీ (ఎక్స్​పోజర్​ అండ్​ రెస్పాన్స్​ ప్రివెన్షన్​) థెరపీ కూడా ఇస్తారు. ఇందులో పేషెంట్​ ఎక్కువగా ఏ విషయాల్లో భయపడుతుంటే  వాటిని దగ్గరగా ఉంచి.. భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి దుమ్ము, ధూళి పట్టుకోమని చెప్పి, చేతులు కడుక్కోనివ్వరు. అయినా ఫలితం కనిపించకపోతే న్యూరోట్రాన్స్​మీటర్​ సెరటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఈ మందులని డాక్టర్​ సలహా ప్రకారమే తీసుకోవాలి. 

ఎవరైనా చేతులు కాస్త ఎక్కువసేపు క్లీన్​ చేస్తే.. ఓసీడీ అనేస్తుంటారు చుట్టూ ఉన్నవాళ్లు. సినిమాల్లో, టీవీల్లోనూ ఓసీడీ పేషెంట్స్​ని  ఇలానే చూపిస్తున్నారు. కానీ, ఓసీడీ అంటే  శుభ్రంగా ఉండటం కాదు. ఇదొక సైకలాజికల్​ డిజార్డర్​. ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు వాళ్ల ఆలోచనల్ని ఆపుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక మదనపడు తుంటారు. ఆ పరిస్థితుల్లో చుట్టూ ఉన్నవాళ్లు.. వాళ్లని అర్థం చేసుకోకుండా చేసిన పనే చేస్తున్నావని తిట్టడం, విసుక్కోవడం లేదా వాళ్లని చూసి నవ్వడం చేస్తే వాళ్లలో డిప్రెషన్​ మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు వాళ్లకి వాళ్లే హాని చేసుకుంటారు. ఈ బాధ నుంచి వాళ్లని బయటపడేయాలంటే అందరూ ఓసీడీపై అవగాహన పెంచుకోవాలి. దీనికి ట్రీట్మెంట్​ ఉందన్న విషయాన్ని తెలుసు కోవాలి. ఓసీడీ అబ్సెషన్స్​ లేదా కంపల్షన్స్​లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డాక్టర్​ని కలవాలి. 

డాక్టర్ కె.జ్యోతిర్మయి (ఎం.డీ),  కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్