గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై మీటింగ్‌.. రేపే ప్రమాణం!

గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై మీటింగ్‌.. రేపే ప్రమాణం!

గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామాతో ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. దీనిపై ఈ రోజు (ఆదివారం) ఉదయం నుంచి కేంద్ర నాయకులు గుజరాత్ వచ్చి మీటింగ్స్‌లో బిజీ బిజీ అయిపోయారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ ఉదయం గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ ఇంట్లో సమావేశమయ్యారు. కొత్త నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటే మేలన్న విషయంపై చర్చించారు. ఈ అంశంలో కేంద్ర పెద్దలు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త సీఎంను ఎన్నుకొనేందుకు మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించబోతున్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్‌ యామల్ వ్యాస్ తెలిపారు. ఈ సమావేశం ఢిల్లీ నుంచి వచ్చిన తోమర్, ప్రహ్లాద్ జోషి, తరుణ్​ చుగ్ నేతృత్వంలో జరుగుతుందని ఆయన చెప్పారు.

రేపే ప్రమాణ స్వీకారం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉండగానే బీజేపీ అధిష్టానం సీఎం విజయ్ రూపానీని పక్కన పెట్టింది. ఆయన స్థానంలో సీఎం అయ్యే చాన్స్ కోసం పలువురు నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సీఎం అయ్యే వ్యక్తి వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికలకు నాయకత్వం వహిస్తారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అదే వ్యక్తి సీఎంగా కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం రేసులో ప్రధానంగా ఆరుగురు నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, పరుషోత్తమ్ రూపాలా, స్టేట్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీజేపీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోర్ధన్ జడాఫియా, రాష్ట్ర మంత్రి ఆర్ సీ ఫాల్దూ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో మాండవీయ, నితిన్ పటేల్, సీఆర్ పాటిల్ రేసులో ముందున్నట్లు సమాచారం. మాండవీయ, రూపాలా ఇద్దరూ గుజరాత్ నుంచే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. సీఆర్ పాటిల్ లోక్ సభ ఎంపీ కాగా.. ఆర్ సీ ఫాల్దూ స్టేట్ బీజేపీ మాజీ ప్రెసిడెంట్. జడాఫియాకు వీహెచ్ పీతో అనుబంధం ఉంది. నితిన్ పటేల్ రాష్ట్రంలోని బలమైన కమ్యూనిటీ పాటిదార్ వర్గానికి చెందిన నాయకుడు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనుండగా.. రేపు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న గుజరాత్ కేబినెట్‌లోనూ కీలక మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారీగా మంత్రులను మార్చే అవకాశం ఉంది.