పిటీ కేసుకే ఎంపీని జైల్లో పెడ్తరా?

పిటీ కేసుకే ఎంపీని జైల్లో పెడ్తరా?

పిటీ కేసుకే ఎంపీని జైల్లో పెడ్తరా?-టీజేఎస్ చీఫ్ కోదండరాం
చర్లపల్లి జైలులో ఎంపీ రేవంత్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

చర్లపల్లి(హైదరాబాద్), వెలుగు: అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్​ చేయడం దారుణమని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశరరెడ్డి, రాజయ్య, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డితో కలిసి కోదండరాం చర్లపల్లి జైల్లో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డ్రోన్​ ఉపయోగించిన నేరం కింద అరెస్టయిన వారిపై పిటీ కేసుపెట్టి, పూచీకత్తుపై లేదా స్టెషన్ బెయిల్ పై రిలీజ్ చేస్తారు.

కానీ, రేవంత్​పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపించడం దారుణం’ అని ఆయన అన్నారు. రేవంత్ గొంతు నొక్కేందుకే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని చెప్పినవారిపైనే చర్యలు తీసుకోవడం అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమన్నారు. వెంటనే రేవంత్ ని విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎటువంటి ఆధారాలు, ప్రొసీజర్​ ఫాలో కాకుండా.. నోటీసు కూడా ఇవ్వకుండా ఒక ఎంపీని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి కక్షసాధింపుచర్యలు మానుకుంటే మంచిదని ప్రభుత్వానికి సూచించారు. బుధవారం రేవంత్​ కు బెయిల్ వచ్చే చాన్స్ ఉందని చెప్పారు.