రాష్ట్రానికి చేరిన వలస కూలీలు..సొంతూళ్లకు కరోనా ముప్పు

రాష్ట్రానికి చేరిన వలస కూలీలు..సొంతూళ్లకు కరోనా ముప్పు

హైదరాబాద్‌‌, వెలుగు: ఉపాధి వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు.. కరోనా భయం.. లాక్ డౌన్  కారణంగా ఇంటి బాట పట్టారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌‌, కర్నాటక, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల నుంచి తిరిగొస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుండి బుధవారం సాయంత్రానికి 42,044 మంది సొంతూళ్లకు చేరారు. అత్యధికంగా మహారాష్ట్ర నుండే 17,485 మంది వచ్చారు. ఇందులోనూ కరోనా కేంద్రంగా మారిన ముంబై నుండి వచ్చినవాళ్లే ఎక్కువ. ఇలా వచ్చిన వారిలో భువనగిరి, మంచిర్యాల, జగిత్యాల, జనగామ జిల్లాలకు చెందిన 35 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. రాష్ట్ర సరిహద్దుల్లో అందరినీ స్ర్కీన్ చేస్తున్నా.. ఇండ్లకు వెళ్లిన తర్వాత లక్షణాలు కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పెరుగుతున్న కేసులు

జనగామ జిల్లాలోని పలు మండలాలకు చెందిన 25 మంది ఓ ప్రైవేటు బస్‌‌లో మూడ్రోజుల క్రితం రాష్ట్రానికి చేరుకున్నారు. బార్డర్‌‌‌‌లో వీళ్లను స్ర్కీన్ చేసిన మెడికల్  సిబ్బంది, హోం క్వారంటైన్‌‌లో ఉండాలని చెప్పి పంపించారు. ఇందులో ఓ జంటకు అదే రోజు సాయంత్రం లక్షణాలు మొదలవడంతో 108కు కాల్‌‌ చేశారు. వారిద్దరినీ దవాఖానకు తరలించి, శాంపిల్స్‌‌ తీసి టెస్టుల కోసం పంపించారు. బుధవారం ఆ ఇద్దరికీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఇలా ముంబై నుంచి వచ్చిన మరో ఇద్దరికీ పాజిటివ్‌‌ వచ్చింది. ఈ నెల 10న ముంబై నుంచే మంచిర్యాల చేరుకున్న ఆరుగురి విషయంలోనూ ఇదే జరిగింది. వీళ్లకు బార్డర్‌‌‌‌లో టెంపరేచర్ చెక్ చేసి, నార్మల్‌‌గా ఉండడంతో హోం క్వారంటైన్‌‌ ముద్ర వేసి ఇండ్లకు పంపించారు. ఆ తర్వాత వైరస్ లక్షణాలు మొదలవడంతో సింగరేణి దవాఖానలోని ఐసోలేషన్‌‌కు తరలించారు. బుధవారం ఈ ఆరుగురికీ పాజిటివ్ వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన మరో ముగ్గురికి, జగిత్యాలకు చెందిన ఇద్దరికి, భువనగిరికి చెందిన 22 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లంతా ముంబై నుంచి వచ్చినవారే.

ఇట్ల చెక్‌‌ చేస్తున్నరు

ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రోడ్డు మార్గంలోనే వస్తున్నారు. మొత్తం 42,044 మందిలో 41,805 మంది రోడ్డు మార్గంలో వస్తే, 239 మంది రైళ్లలో వచ్చారు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో బార్డర్లు ఉన్నాయి. ఈ బార్డర్లలో వైద్య ఆరోగ్యశాఖ 87 చెక్‌‌ పోస్టులు పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ఈ చెక్‌‌ పోస్టుల వద్ద థర్మల్ స్ర్కీనింగ్‌‌ చేస్తున్నారు. బాడీ టెంపరేచర్‌‌‌‌ నార్మల్‌‌గా ఉండి వైరస్ లక్షణాలు లేని వాళ్లకు హోంక్వారంటైన్ ముద్ర వేసి ఇండ్లకు పంపుతున్నారు. వైరస్ లక్షణాలుంటే దవాఖాన్లకు తరలించి టెస్టులు చేయిస్తున్నారు. వచ్చిన వాళ్ల పేరు, ఊరు, ఫోన్ నంబర్‌‌‌‌, వాళ్లు వచ్చిన వెహికల్ నంబర్ సహా అన్నింటినీ ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్ చేస్తున్నారు. ఏ జిల్లా వారి వివరాలను ఆ జిల్లా అధికారులకు పంపిస్తున్నారు. వారంతా హోంక్వారంటైన్‌‌లో ఉండేలా చూడాల్సిన బాధ్యతలను ఆశ వర్కర్లకు అప్పగిస్తున్నారు. కేంద్రం అనుమతి ఇవ్వకముందే కొంతమంది వివిధ మార్గాల్లో అధికారులకు తెల్వకుండానే ఇండ్లకు చేరారు. ఇలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని, కొత్తవాళ్లు ఎవరొచ్చినా 108కు, స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆరోగ్యశాఖ కోరింది.

టెస్టులు చేయకుండానే డిశ్చార్జ్