నక్సల్స్‌ నుంచి భర్తను కాపాడుకున్న భార్య

నక్సల్స్‌ నుంచి భర్తను కాపాడుకున్న భార్య
  • నాలుగు రోజుల పాటు అడవిలోనే

‌‌బీజాపూర్‌‌: నక్సల్స్‌ చేతిలో కిడ్నాపైన తన భర్త కోసం భార్య సాహసం చేసింది. నాలుగు రోజుల పాటు అడవిలోనే గడిపి ఆయన్ను నక్సల్స్‌ భారి నుంచి కాపాడుకుంది. వాళ్లను బతిమాలి తన భర్తను ఇంటికి తీసుకొచ్చింది. బీజాపూర్‌‌లోని భోపాలపట్నంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంతోష్ కట్టం అనే వ్యక్తి ఈ నెల 4న నిత్యావసరాలు కొనేందుకు బయటికి వెళ్లి తిరిగిరాలేదు. అయితే ఆయన్ను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారని తెలియడంతో ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టి ఊరికే కూర్చొకుండా తన భర్తను వెతకడం మొదలుపెట్టింది. కూతురు, మరి కొంత మంది ఊరి వాళ్లతో కలిసి అడవిలో దాదాపు నాలుగు రోజుల పాటు గాలించింది. నాలుగు రోజుల తర్వాత నక్సల్స్‌ చెరలో ఉన్న ఆమె భర్త జాడను కనుక్కుంది. నక్సల్స్‌తో మాట్లాడి వారిని ఒప్పించి భర్తను విడిపించుకుంది. సునీత వెళ్లడం ఒకరోజు ఆలస్యమైనా దారుణం జరిగేదని గ్రామస్తులు చెప్పారు. ఈ నెల 11న మావోయిస్టులు ‘జన్‌ అదాలత్‌’ నిర్వహించి సంతోష్‌ను ఏం చేయాలనే విషయాన్ని డిసైడ్‌ చేసేవారని తెలుస్తోంది. ‘భర్తకు కష్టం వస్తే దాన్ని తీర్చేందుకు మహిళ ఎంత దూరమైనా వెళ్తుంది. నేను కూడా అదే చేశాను” అని సునీత మీడియాతో చెప్పారు. పోలీస్‌ ఉద్యోగంలో కొనసాగకూడదనే కండిషన్‌పై సంతోష్‌ను వదిలిపెట్టారని అన్నారు. తమ ఏరియాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని ముందే తెలుసని, అందుకే భయపడకుండా అడవిలోకి వెళ్లాలని ఆమె అన్నారు. మోటర్‌‌ సైకిళ్లపైన, నడిచి అడవి మొత్తం వెతికామని చెప్పారు.