సెమీస్ ఫైట్ కు వర్షం అడ్డంకి… 19 ఏళ్ల తర్వాత రిజర్వ్‌‌ పోరు

సెమీస్ ఫైట్ కు వర్షం అడ్డంకి… 19 ఏళ్ల తర్వాత రిజర్వ్‌‌ పోరు

వర్షం వస్తుందేమోనని లోలోపల అనుకుంటూనే టాస్​ వేసినా.. రాలేదు..! 
మ్యాచ్​దిగ్విజయంగా మొదలైంది..!  ఏం ఢోకాలేదు.. ఓ ఇన్నింగ్స్​ ముగుస్తుందిలే అనుకున్నాం..! కానీ టీమిండియా బౌలర్ల ధాటికి భయపడి కివీస్ ​పిలిచినట్లు.. మేఘాల చాటు నుంచి హఠాత్తుగా ఊడిపడ్డాడు వరుణుడు.  ఏదో నాలుగు చినుకులు రాల్చి వెళ్లిపోతాడులే అనుకుంటే.. భారీగానే కురిశాడు. ఇంకొక్క నాలుగు ఓవర్లు ఓపిక పట్టి ఉంటే.. మన టార్గెట్​ఎంతో తెలిసిపోయేది. ఇప్పుడు అటుఇటు కాకుండా చేశాడు వాన దేవుడు. రిజర్వ్​డే ఉందని సంతోషించినా.. బుధవారం కూడా భారీ వర్షం కురిసే చాన్సే ఎక్కువగా ఉంది. కాబట్టి మ్యాచ్​రద్దయినా నష్టం లేదు కానీ.. ఇదే పరిస్థితి కొనసాగి డక్​వర్త్​ లూయిస్​కు దారితీసినా.. లేదా ఓ 20 ఓవర్ల మ్యాచ్​ ఆడాల్సిన పరిస్థితి తలెత్తినా.. టీమిండియాకు గండం తప్పకపోవచ్చు..! మరి వాన దేవుడు మనల్ని కరుణిస్తాడో.. లేక కివీస్​ను కనికరిస్తాడో చూడాలి..!

ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో.. వాటన్నింటిని అందుకుంటూ వరల్డ్​కప్​ సెమీస్ పోరులో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఇప్పుడు కాకపోతే.. ఎప్పుడూ కాదనే రీతిలో బుమ్రా (1/25), భువనేశ్వర్​(1/30) పేస్, స్వింగ్​తో దుమ్మురేపుతూ న్యూజిలాండ్​బ్యాట్స్​మెన్​ను నిలువెల్లా వణికించారు.  దీంతో మంగళవారం మొదలైన ఈ మ్యాచ్​లో కివీస్​46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం రావడంతో మ్యాచ్​ను రిజర్వ్​డేకు వాయిదా వేశారు. టేలర్​ (67 నాటౌట్​), లాథమ్​(3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. కెప్టెన్​ విలియమ్సన్​(95 బంతుల్లో 6 ఫోర్లతో 67) హాఫ్​సెంచరీతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్​ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే బుధవారం కొనసాగించనున్నారు.

‘పేస్’ అదుర్స్​…
ఫ్లాట్ వికెట్​పై​ టాస్​ ఓడిపోయానన్న బాధతో ఉన్న విరాట్​కు పేసర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వాతావరణం మేఘావృతం కావడంతో బ్రాండ్​ న్యూ పిచ్​పై భువనేశ్వర్, బుమ్రా… పేస్​, స్వింగ్​తో నిప్పులు కురిపించారు. భువీ తొలి బంతికే గప్టిల్ (1) వికెట్ల ముందు దొరికాడు. కానీ బాల్ వికెట్ల నుంచి ఇంచు మందంలో పక్కకు పోవడంతో ఇండియా రివ్యూ వృథా అయ్యింది. రెండో ఎండ్​లో బుమ్రా.. షార్ట్​ పిచ్, యాంగిల్​ బంతులు వేస్తూ నికోల్స్​(28)ను కట్టడి చేశాడు. తొలి రెండు ఓవర్లు మెయిడెన్, మూడో ఓవర్​లో ఒక్క రన్​మాత్రమే రావడంతో గప్టిల్​పై ఒత్తిడి పెరిగింది. ​బుమ్రా తన రెండో ఓవర్​లో త్రీ క్వార్టర్​లెంగ్త్​తో వేసిన మూడో బంతిని గప్టిల్​అర్థం చేసుకునే లోపే బ్యాట్​ ఎడ్డ్​ను తాకి స్లిప్​లోకి వెళ్లింది. రెండో స్లిప్​లో ఫీల్డింగ్​ చేస్తున్న విరాట్​కళ్లు చెదిరే స్థాయిలో డైవింగ్​క్యాచ్​అందుకున్నాడు. దీంతో కివీస్​ స్కోరు 1/1గా మారింది. ఈ దశలో వచ్చిన విలియమ్సన్ ఆచితూచి ఆడటం, నికోల్స్​షాట్స్ కొట్టడానికి భయపడటంతో రన్​రేట్​ మందగించింది. 8వ ఓవర్​లో కివీస్​కు తొలి ఫోర్​ వచ్చిందంటే బుమ్రా, భువీ ఎంతలా భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇద్దరి దెబ్బకు కివీస్​ తొలి పవర్​ప్లేలో 27/1 స్కోరు మాత్రమే చేసింది.

పాండ్యా, జడ్డూ సూపర్..​
తొలి పవర్​ప్లే మొత్తం బుమ్రా, భువీ చెలరేగితే.. మిడిల్ ఓవర్లలో పాండ్యా (1/55), జడేజా (1/34) విజృంభించారు. హార్దిక్​ స్లో బౌన్సర్లతో, జడ్డూ వికెట్​టు వికెట్​బౌలింగ్​తో విలియమ్సన్–నికోల్స్​ను పూర్తిగా కట్టడి చేశారు. దీనిని నుంచి బయటపడేందుకు కివీస్​ జోడీ స్ర్టయిక్​ రొటేషన్​తో సింగిల్స్​వైపు మొగ్గింది.  ఓ ఎండ్​లో పాండ్యాను కొనసాగించిన విరాట్​.. మధ్యలో చహల్​(1/63), జడేజాను మార్చిమార్చి ప్రయోగించాడు. ఈ వ్యూహం 19వ ఓవర్​లో ఫలితాన్నిచ్చింది. జడేజా వేసిన షార్ప్​టర్న్​ బంతి నికోల్స్ వికెట్లను పడగొట్టింది. రెండో వికెట్​కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ వికెట్​తర్వాత పాండ్యాను డ్రాప్​ చేసి రెండువైపుల నుంచి స్పిన్నర్లను కొనసాగించాడు కోహ్లీ. అనుభవజ్ఞుడు టేలర్ జతకావడంతో విలియమ్సన్​ స్వేచ్చగా ఆడాడు. స్లాగ్​స్వీప్​షాట్లు కొడుతూ 79 బంతుల్లో హాఫ్​సెంచరీ పూర్తి చేశాడు. జడేజా తన 10 ఓవర్ల కోటాలో 38 డాట్​బాల్స్​వేయడం విశేషం. చహల్​కూడా లెగ్ బ్రేక్స్​తో బంతిని బాగా టర్న్​చేశాడు. 36వ ఓవర్​లో విలియమ్సన్​ను ఔట్​చేసి దెబ్బకొట్టాడు. మూడో వికెట్​కు 65 రన్స్​జత కావడంతో కివీస్​కాస్త కోలుకుంది. అయితే టేలర్​ఎక్కువగా డాట్​బాల్స్​ఆడటంతో సెకండ్​పవర్​ప్లే కీలక దశలో కివీస్​17 ఓవర్లలో 65 పరుగులే చేయగలిగింది. ఓవరాల్​గా 40 ఓవర్లలో కివీస్​ 155/3 స్కోరు మాత్రమే చేసింది. మూడు పరుగుల వద్ద క్యాచ్​ఔట్​నుంచి బయటపడ్డ నీషమ్​(12) తర్వాతి ఓవర్​లోనే ఔటైనా.. టేలర్​దూకుడుగా ఆడాడు. చహల్​వేసిన 44వ ఓవర్​లో ఓ సిక్స్​, మూడు ఫోర్లతో 18 రన్స్​రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్​లోనే గ్రాండ్​హోమ్​(16) వికెట్​తీసి ఇండియా మళ్లీ పట్టుబిగించింది. ఐదో వికెట్​కు 38 పరుగులు జతకావడంతో కివీస్​స్కోరు 200 దాటింది. లాథమ్ వచ్చాడో లేదో వర్షం మొదలైంది. అలా మొదలైన వాన దాదాపు రెండున్నర గంటలపాటు కురిసింది. మధ్యలో తెరిపినిచ్చినా.. ఔట్​ఫీల్డ్​చిత్తడిగా ఉండటంతో మ్యాచ్​ను రిజర్వ్​డేకు వాయిదా వేశారు.

ఇండియా టార్గెట్​ ఇది !
బుధవారం కూడా అనుకున్న సమయానికి మ్యాచ్ మొదలుకాకుం డా, కివీస్ ఇన్నింగ్స్ పూర్తికాకపోతే.. డక్ వర్త్​ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియా టార్గెట్ ను సవరిస్తారు. అప్పడు టీమిండియా 46 ఓవర్ల మ్యాచ్ గనుక ఆడితే 237 రన్స్ చేయాలి. లేక 40 ఓవర్ల ఆటే సాధ్యమైతే 223 రన్స్ చేయాలి. ఒకవేళ 35 ఓవర్లు ఆడితే 209 రన్స్, 30 ఓవర్లు ఆడితే 192 రన్స్, 25 ఓవర్లు ఆడితే 172 రన్స్, 20 ఓవర్ల ఆట అయితే 148 రన్స్ చేయాలి. వర్షం వల్ల 20 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తారు. అప్పడు టేబుల్ టాపర్ గా ఉన్న విరాట్ సేన ఫైనల్ కు చేరుకుం టుంది

27/1 : తొలి పది ఓవర్లలో న్యూజిలాండ్‌‌ స్కోరు. ఈ వరల్డ్‌‌కప్‌‌లో పవర్‌‌ప్లేలో  ఇదే అతి అత్యల్పం.

19 ఏళ్ల తర్వాత రిజర్వ్‌‌ పోరుకు

ఇండియా 19 ఏళ్ల తర్వాత వరల్డ్​కప్​లో రిజర్వ్​ మ్యాచ్​ ఆడనుంది. చివరిగా 1999 వరల్డ్‌‌కప్‌‌లో టీమిండియా రిజర్వ్‌‌ డే మ్యాచ్‌‌ ఆడింది.  ఆ టోర్నీ గ్రూప్‌‌ దశలో  ఇంగ్లండ్‌‌తో జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌‌ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.  బర్మింగ్‌‌హామ్‌‌లో జరిగిన ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 232 రన్స్‌‌ చేసింది. ఛేజింగ్‌‌లో  ఇంగ్లండ్‌‌ 20.3 ఓవర్లలో 73/3తో ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచింది. రిజర్వ్‌‌ డే అయిన తర్వాతి రోజు ఆట కొనసాగించారు. ఇండియా అద్భుత బౌలింగ్‌‌ ధాటికి ఇంగ్లండ్‌‌ 45.2 ఓవర్లలో 169 రన్స్‌‌కే కుప్పకూలింది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్‌‌ సిక్స్‌‌కు అర్హత సాధించగా.. ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.  అంతకుముందు  1979 వరల్డ్‌‌కప్‌‌ గ్రూప్‌‌ దశలో  ఇండియా–శ్రీలంక మధ్య  జూన్‌‌ 16న జరగాల్సిన మ్యాచ్‌‌కు వర్షం అడ్డువచ్చింది.  సెకండ్‌‌ రిజర్వ్‌‌ డే అయిన 18న మ్యాచ్‌‌ నిర్వహించగా శ్రీలంక 47 రన్స్‌‌ తేడాతో ఇండియాను ఓడించింది.1983లో గ్రూప్‌‌–బిలో ఇండియా తన తొలి మ్యాచ్‌‌ను వెస్టిండీస్‌‌తో రెండు రోజుల పాటు ఆడింది. ఇందులో 34 పరుగుల తేడాతో నెగ్గిన ఇండియా  ప్రపంచకప్‌‌లో కరీబియన్‌‌ టీమ్‌‌కు తొలి ఓటమి రుచి చూపించింది.

స్కోర్ బోర్డు

న్యూజిలాండ్: గప్టిల్​ (సి) కోహ్లీ (బి) బుమ్రా 1, నికోల్స్​(బి) జడేజా 28, విలియమ్సన్​ (సి) జడేజా (బి) చహల్​ 67, టేలర్ (నాటౌట్) 67, నీషమ్ (సి) కార్తీక్​(బి) పాండ్యా 12, గ్రాండ్ హోమ్​(సి) ధోనీ (బి) భువనేశ్వర్​16, లాథమ్ (నాటౌట్) 3, ఎక్స్​ట్రాలు: 17, మొత్తం: 46.1 ఓవర్లలో 211/5.  వికెట్లపతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200.  బౌలింగ్: భువనేశ్వర్ 8.1–1–30–1​, బుమ్రా 8–1–25–1, పాండ్యా 10–0–55–1, జడేజా 10–0–34–1, చహల్​ 10–0–63–1.