కాళేశ్వరం అవినీతిపై బండి, రేవంత్ ఎందుకు ప్రశ్నిస్తలేరు : షర్మిల

కాళేశ్వరం అవినీతిపై బండి, రేవంత్ ఎందుకు ప్రశ్నిస్తలేరు : షర్మిల

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ను రూ.38 వేల కోట్లతో చేపడితే..  ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో జాతీయస్థాయిలో అవినీతి జరిగిందని మండిపడ్డారు. 

ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డి తోడు దొంగలైతే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీతగాళ్లని షర్మిల కామెంట్ చేశారు. ప్రాజెక్ట్లో జరిగిన అవినీతిపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మేఘా కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మీడియా సహా అందరినీ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపణలు చేసే బీజేపీ.. కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. 

కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు జరుపుతామని సీబీఐ, కాగ్ హామీ ఇచ్చాయని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగినా వైఎస్సార్టీపీ తప్ప ఇంకే పార్టీ ఆ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల డబ్బును కేసీఆర్ బందిపోటులా దోచుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్రం ఎంక్వైరీ కమిషన్ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. విభజన హామీలు నెరవేర్చని బీజేపీ మునుగోడులో సిగ్గులేకుండా ఓట్లు అడుగుతోందని షర్మిల ఫైర్ అయ్యారు.