ఆల్కహాల్ డెలివరీ దిశగా జొమాటో ప్రయత్నాలు!

ఆల్కహాల్ డెలివరీ దిశగా జొమాటో ప్రయత్నాలు!

న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కస్టమర్స్ కు ఆల్క్ హాల్ పంపిణీ చేయాలని భావిస్తోందని నేషనల్ మీడియా సమాచారం. కరోనా లాక్ డౌన్ తో మందుకు విపరీతంగా గిరాకీ పెరిగినందున దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో జొమాటో ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లపై ఆంక్షలు విధించడంతో ప్రజలు ఫుడ్ ఆర్డర్ చేయలేని పరిస్థితులు ఏర్పడటంతో జొమాటో తన వ్యాపారాన్ని నిత్యావసరాల డెలివరీస్ వైపు మళ్లించింది. మార్చి 25న దేశవ్యాప్తంగా ఆల్కహాల్ స్టోర్స్ ను మూసి వేశారు. మళ్లీ ఈ వారంలోనే వైన్ షాపులను రీ ఓపెన్ చేస్తున్నారు. అయితే దాదాపుగా వైన్ షాప్స్ తెరిచిన ప్రతి చోట వందలాది మంది ప్రజలు క్యూల్లో నిలబడుతున్నారు. రద్దీతో అనేక ఏరియాల్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడంతో పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు.

ఐఎస్ డబ్ల్యూఏఐ తో కలసి ముందుకు..!
ఇండియాలో ఆల్కహాల్ హోమ్ డెలివరీపై ఎటువంటి చట్టపరమైన నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్​ ఇండియా (ఐఎస్ డబ్ల్యూఏఐ) జొమాటోతోపాటు ఇతర సంస్థలతో కలసి కంజక్షన్ పాలసీ మార్పు కోసం యత్నిస్తోంది. టెక్నాలజీ సాయంతో హోమ్ డెలివరీ చేయడం ద్వారా ఆల్కహాల్ ను తగు మోతాదులోనే తాగేలా బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించొచ్చు అని జొమాటో సీఈవో మోహిత్ గుప్తా చెప్పారని అభిజ్ఞ వర్గాల ప్రకారం తెలుస్తోంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేయాలని జొమాటో భావిస్తున్నట్లు ఐఎస్ డబ్ల్యూఏఐకు అందజేసిన ఓ పబ్లిష్ కాని ఒక డాక్యుమెంట్ లో గుప్తా రాశారని సమాచారం.