- ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- టెర్రర్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా ఢిల్లీలో భారీగా లైవ్ క్యాట్రిడ్జ్ లు(బులెట్లు) పట్టుబడ్డాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్‌లో 2,251 బులెట్లు పట్టకున్నామని, వీటికి సంబంధించి ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని శుక్రవారం ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజ్మల్, రషీద్, సద్దాం, డెహ్రాడూన్‌కు చెందిన పరీక్షిత్ నేగి, ఢిల్లీకి చెందిన కమ్రాన్, రూర్కీకి చెందిన నాసిర్గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులంతా ఓ క్రిమినల్ నెట్ వర్క్ కు చెందినవారు అని తెలిపారు. దీని వెనక టెర్రరిస్ట్ యాంగిల్ ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
‘‘ఆగస్ట్ 6న సాయంత్రం 6.30కు ఆనంద్ విహార్ టెర్మినల్ వద్ద ఇద్దరు వ్యక్తులు పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని అనుమానస్పదంగా కన్పించారని ఓ ఆటో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. వెంటనే వారిని పట్టుకుని బ్యాగ్‌లు చెక్ చేయగా బులెట్లు దొరికాయి. అవన్నీ వివిధ రకాల ఇంపోర్టెడ్ క్యాట్రిడ్జ్ లుగా గుర్తించాం. తమకు డెహ్రాడూన్ లో ఓ వ్యక్తి ఆ బులెట్లు ఇచ్చాడని, వాటిని తాము లక్నోకు డెలివరీ చేయాల్సి ఉందని విచారణలో అజ్మల్, రషీద్ వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా నిందితులను ప్రత్యేక బృందాలను పంపి పట్టుకున్నాం” అని పోలీసులు వివరించారు. ఈ కేసులో క్రిమినల్ నెట్‌వర్క్‌ను మరింతలోతుగా ఛేదించాల్సి ఉందని, మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

