వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వేళ హార్మూజ్ జలసంధిపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు రవాణకు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి నౌకాదళ దిగ్బంధనాన్ని విధించబోమని తెలిపారు.
ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ బలగాలు మోహరించి ఉంటాయని.. ఒక వేళ ఇరాన్ ఏమైనా తోక జాడిస్తే దిగ్బంధనాన్ని తక్షణమే పునరుద్ధరిస్తామని హెచ్చరించారు.
చర్చల్లో భాగంగా.. భవిష్యత్తులో చాలా కాలం పాటు అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ సంపూర్ణంగా అంగీకరించిందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్య ఇరాన్ అణు నిజాయితీని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. అణు తనిఖీలను ఇరాన్ అంగీకరించడం చర్చలకు కీలకమైన షరతు అని.. ఒకవేళ ఇరాన్ ఈ డిమాండ్‌ను తిరస్కరించి ఉంటే ఇకపై చర్చలు జరిగి ఉండేవి కావని పేర్కొన్నారు.
►ALSO READ | బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా... పదేండ్లలో ఆరుగురు ప్రధానులు రిజైన్
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్న ట్రంప్.. ఇది అమెరికా దౌత్య విజయంగా అభివర్ణించారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు అమెరికా ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, హార్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ కంట్రోల్లోనే ఉంటుందని ఇరాన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే హార్మూజ్ జలసంధిపై తామే ఆధిపత్యం చెలాయిస్తామని పేర్కొనడం గమనార్హం.
