బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా... పదేండ్లలో ఆరుగురు ప్రధానులు రిజైన్

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా... పదేండ్లలో ఆరుగురు ప్రధానులు రిజైన్
  • 2024లో రిషి సునాక్ దిగిపోయిన తర్వాత పదవిలోకి వచ్చిన స్టార్మర్

లండన్‌‌‌‌‌‌‌‌: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. సొంత లేబర్ పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాను ప్రధాని పదవితో పాటు, లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు తెలిపారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు తాను పదవిలో కొనసాగుతానని, కొత్తగా ఎన్నికయ్యే నాయకుడికి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. 

దేశ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోమవారం ఉదయమే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3కు ఫోన్ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. సెప్టెంబరులో ప్రారంభమయ్యే తదుపరి పార్లమెంట్ సమావేశాల కంటే ముందే కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని లేబర్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ను కోరినట్టు వివరించారు.

బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో ప్రధానులు మారడానికి కారణాలు

బ్రెగ్జిట్ నిర్ణయం దేశంలోని రాజకీయ ఏకాభిప్రాయాన్ని పూర్తిగా దెబ్బతీసి, అధికార పార్టీలలో తీవ్ర సిద్ధాంతపరమైన చీలికలను తెచ్చింది. దీనికి తోడు బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ప్రధానులు పూర్తిగా సొంత పార్టీ ఎంపీల నమ్మకంపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీలో తిరుగుబాటు వస్తే దేశవ్యాప్త ఎన్నికలు లేకుండానే కేవలం అంతర్గత ఓటింగ్ ద్వారా ప్రధానిని మార్చే వీలుంటుంది. 

మరోవైపు, బ్రెగ్జిట్ దుష్ప్రభావాలు, కొవిడ్ మహమ్మారి తెచ్చిన భారీ ఖర్చులు, అంతర్జాతీయ ఘర్షణల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణం వంటివి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడంతో ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైంది. చివరగా, ప్రస్తుత ఓటర్లలో సంప్రదాయ పార్టీలపై నమ్మకం తగ్గి తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. కొత్త నాయకులు ఆశించిన స్థాయిలో వేగంగా మార్పులు తీసుకురాలేకపోతే, వచ్చే ఎన్నికల్లో తమ సీట్లను కాపాడుకోవడం కోసం ఎంపీలే స్వయంగా తమ ప్రధానులను పదవుల నుంచి తొలగిస్తున్నారు.          

పదేండ్లలో ఆరుగురు ప్రధానులు

పదవీకాలం ముగియక ముందే వైదొలిన బ్రిటన్ ప్రధానుల జాబితాలో కీర్ స్టార్మర్ ఆరో వ్యక్తిగా నిలిచారు. 2024లో రిషి సునాక్ రాజీనామా చేయడంతో ప్రధాని బాధ్యతలు చేపట్టిన స్టార్మర్.. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్) రిఫరెండం జరిగి సరిగ్గా 10 ఏండ్లు పూర్తవుతున్న తరుణంలో.. దానికి ఒకరోజు ముందే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు లిజ్ ట్రస్, రిషి సునాక్, బోరిస్ జాన్సన్,  థెరిసా మే, డేవిడ్ కామెరూన్ ప్రధానిగా సేవలందించారు.