పరీక్ష పాసై నాలుగేండ్లయినా.. ఫైనల్​ లిస్ట్​ ప్రకటిస్తలేరు!

పరీక్ష పాసై నాలుగేండ్లయినా.. ఫైనల్​ లిస్ట్​ ప్రకటిస్తలేరు!
  • ఎదురుచూపుల్లో గురుకుల పీఈటీ అభ్యర్థులు
  • కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోని సర్కారు

యాదగిరిగుట్టకు చెందిన శిరీష 2018లో గురుకుల పీఈటీ పరీక్ష రాసి సెలక్ట్ అయ్యారు. ఉద్యోగం రాగానే పెండ్లి చేసుకోవాలని అనుకున్నారు. వేర్వేరు కారణాలతో ఇప్పటికీ ఫైనల్ లిస్ట్ ప్రకటించకపోవడంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ప్రైవేట్ స్కూల్​లో కొన్నేండ్లుగా పీఈటీగా చేస్తున్నారు. కొవిడ్ కారణంగా దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రైవేట్ స్కూళ్లు తెరవకపోవడంతో జీతం రాక ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిపోతుండడం, ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా ఉద్యోగం, పెండ్లి రెండూ లేటవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల స్కూళ్లలో 616 పీఈటీ పోస్టుల భర్తీ కోసం 2017లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మహిళలకు 450 పోస్టులు, పురుషులకు 166 పోస్టులు కేటాయించింది. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 2018లో నియామక పరీక్ష నిర్వహించారు. అందులో పాసైన వారికి అదే ఏడాది మే 14, 15, 16 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. 1:3 పర్సెంటేజీలో దాదాపు 2 వేల మంది పోటీలో ఉండగా, అదే సమయంలో కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్​ సక్రమంగా లేదంటూ హైకోర్టుకు వెళ్లి స్టే తేవడంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో హైకోర్టు రెండు వారాల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని పరీక్ష రాసిన అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2018లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఆలస్యం కావడంతో అభ్యర్థులు విలువైన సర్వీస్ కాలాన్ని కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగం పొందితే రావాల్సిన బెనిఫిట్స్ ను కోల్పోయారు. పెళ్లి, కుటుంబం, ఇతర బాధ్యతల గురించి ముందే వేసుకున్న ఒక్క ప్లాన్ కూడా వర్కవుట్ కాకపోవడంతో నిరాశ, నిస్పృహలకు గురై మానసిక ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఏపీలో 2012లో నోటిఫికేషన్ తర్వాత  తెలంగాణలో 2017లో నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు పీఈటీ ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,600 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఒక్క పీఈటీ కూడా లేరని, 4,570 హై స్కూళ్లలో 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఈటీల సంఘం నేతలు చెబుతున్నారు. స్కూళ్లు, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, గురుకులాల్లో కలిపి మొత్తం 7,874 పీఈటీ, పీడీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని అంటున్నారు. 
ఆందోళనలు చేస్తున్నా..
గురుకులాల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు అనేకసార్లు ఆందోళనకు దిగారు. మూడు నాలుగుసార్లు ప్రగతి భవన్, 20 సార్లకు పైగా టీఎస్ పీఎస్సీ ఆఫీస్ ను ముట్టడించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఓ పక్క ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తూనే మరోపక్క కుటుంబాన్ని గడిపేందుకు ప్రైవేట్ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. అయితే కొవిడ్ కారణంగా ప్రైవేట్ స్కూళ్లలో ఏడాదిన్నర నుంచి తరగతులు నిర్వహించకపోవడం వీళ్లకు శాపంగా మారింది. ఆన్ లైన్ క్లాసులు మాత్రమే చెబుతుండడంతో పీఈటీలకు పని లేకుండా పోయింది. దీంతో చాలావరకు ప్రైవేట్ స్కూళ్లు పీఈటీలను పక్కన పెట్టేశాయి. కొన్ని స్కూళ్లలో పీఈటీ టీచర్లను కొనసాగించినా, కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే వేతనాలను ఇస్తున్నారు. దీంతో వేరే పని చేసుకోలేక, చాలీచాలని జీతాలతో నెట్టుకురాలేక ఇబ్బంది పడుతున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ఒకరు, వరంగల్, నల్గొండ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారని పీఈటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు చెబుతున్నారు.
వారంలోగా ఉద్యోగాలు ఇవ్వండి
రెండు వారాల్లోగా మాకు పోస్టింగ్ లు ఇవ్వాలని హైకోర్టు తీర్పిచ్చినా ప్రభు త్వం పట్టించుకోవ డం లేదు. వంద లాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదిస్తే, మాకు ఉద్యోగాలివ్వకుండా మళ్లీ కాంట్రాక్టు వాళ్లతో భర్తీ చేస్తామంటున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల ఆలస్యమైంది. వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్  రిలీజ్ చేసి, వారంలోగా మాకు పోస్టింగ్ లు ఇవ్వాలి.                                                                                                                                                - దుర్గ, కోదాడ