స్టేడియం హౌస్ ఫుల్ చేసేందుకు అనుమతించండి

స్టేడియం హౌస్ ఫుల్ చేసేందుకు అనుమతించండి
  • యూఏఈ ప్రభుత్వానికి బీసీసీఐ వినతి

అబుదాబీ: ఐపీఎల్ మ్యాచులు విజయవంతంగా నడుస్తున్న నేపధ్యంలో క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదని చింతిస్తున్న వారికి వచ్చే నెలలో  టీ20 ప్రపంచకప్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్ పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మధ్య వీక్షించే అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తోంది. ఈమేరకు దుబాయ్‌ స్టేడియంలోకి పూర్తి సామర్థ్యంలో అభిమానులను అనుమతించాలని యూఏఈ ప్రభుత్వాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది.
నిజానికి ఈ టీ20 ప్రపంచకప్ భారత్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈ, ఒమన్‌లో బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరపాలని నిర్ణయించారు.  వచ్చే అక్టోబర్ నెల 17న టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్ 14న  ఫైనల్‌ మ్యాచ్ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీ ముగిసిన రెండు రోజుల తర్వాత టీ20 ప్రపంచకప్ దుబాయ్ వేదికగా ప్రారంభం అవుతోంది. ఐపీఎల్ ను విజయవంతంగా నిర్వహించిన ఊపులో.. టీ20 ప్రపంచకప్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో న‌వంబ‌ర్ 14న జ‌ర‌గ‌బోయే టీ20 ప్రపంచకప్‌ 2021 ఫైన‌ల్‌ మ్యాచ్ కు సాధ్యమైనంత ఎక్కువ మందిని లేదా  25 వేల మందిని అనుమ‌తించే అవకాశం కల్పించాలని కోరుతూ బీసీసీఐ యూఏఈ ప్రభుత్వానికి లేఖలు రాసింది. బీసీసీఐకి తోడుగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) రెండు బోర్డులు అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేయడంతో యూఏపీ ప్రభుత్వం ఏం చెబుతుందా అని చాలా ఆతృత‌ ఏర్పడింది. బీసీసీఐ వినతిపై యూఏఈ ప్రభుత్వం, అధికారులు సానుకూలంగా స్పందించే అవకాశముందని ఆశాభావంతో ఉన్నారు.